కిక్కెక్కించారు
● ఒక్కరోజులోనే రూ.10.27 కోట్ల మద్యం అమ్మకాలు
● మద్యంతోపాటు మాంసం, కేకుల విక్రయాలు
● దుకాణాల్లో ముందస్తుగా స్టాక్ నిల్వలు
సంగారెడ్డి జోన్: నూతన సంవత్సర వేడుకల పేరుతో మద్యం తెగ తాగేశారు. జిల్లాలో బుధవారం ఒక్కరోజే రూ.10.27కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2026 ఏడాదికి స్వాగతం చెబుతూ 2025 ఘనంగా వీడ్కో లు పలికారు. అర్ధరాత్రి 12:00కు బాణసంచా పేలుస్తూ కేరింతల మధ్య కేకులను కట్ చేశారు.
101 మద్యం దుకాణాలు.... 35 బార్లు
జిల్లా వ్యాప్తంగా 101 మద్యం దుకాణాలు, 35 బార్లు ఉన్నాయి. 2024 డిసెంబర్ 31 రోజు రూ.10.19 కోట్ల మద్యం అమ్మకాలు విక్రయించగా..2025 డిసెంబర్ 31రోజున రూ.10.27 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. 2024 కంటే 2025లో రూ.9 లక్షలు అధికంగా తాగేశారు. ఇందులో బీర్ల కంటే ఐఎంఎల్ మద్యమే ఎక్కువగా సేవించారు. 2024 డిసెంబర్ నెలలో రూ.164.89 కోట్లు అమ్మగా 2025లో ఒక్క నెలలోనే రూ.224.06 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ మేరకు ఐఎంఎల్ బాక్స్ లు 28.31% అమ్మకాలు పెరగగా, బీర్ బాక్స్‌లు 5% తగ్గాయి.
అర్ధరాత్రి వరకు కొనసాగిన అమ్మకాలు
సాధారణంగా ప్రతిరోజు వైన్ షాపులు రాత్రి 10:00 గంటలు, బార్లు 11 గంటల వరకు తెరిచి ఉంటాయి. కానీ నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, గంట అదనంగా బార్లు రెస్టారెంట్లు తెరుచుకొని ఉన్నాయి. మద్యం ప్రియుల డిమాండ్ మేరకు దుకాణదారులు అన్ని రకాల బ్రాండ్లు నిల్వ చేసి ఉంచారు. మద్యం అమ్మకాలు జోరుగా సాగడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. డిసెంబర్ 31 రోజంతా చికెన్, మటన్ దుకాణాలు కిటకిటలాడాయి. సాధారణ రోజుల కంటే మాంసం విక్రయాలు కూడా అధికంగా జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.


