సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలి | Harish Rao Open Challenge To CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలి

Jul 12 2025 4:50 AM | Updated on Jul 12 2025 4:50 AM

Harish Rao Open Challenge To CM Revanth Reddy

ప్రాజెక్టులపై ఆధారాలతో వచ్చి మాట్లాడతాం: హరీశ్‌రావు

నదీ జలాలపై సీఎంది ‘కవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌’ 

కేబినెట్‌ నిర్ణయాలు,నోట్‌ అడిగితే ఇవ్వడం లేదు 

కమిషన్‌కు ఇచ్చిన వివరాలు మాకెందుకు ఇవ్వరు? 

కాళేశ్వరంపై ఘోష్‌ కమిషన్‌కు అదనపు వివరాలు అందజేత

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేయాలని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు సవాల్‌ చేశారు. తాము పూర్తి సమాచారంతో వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల్లో ఆరుసార్లు నిర్ణయాలు జరిగాయని, శాసనసభలో మూడుమార్లు ఆమోదం పొందాయని తెలిపారు. కేబినెట్, అసెంబ్లీ సమావేశాల తేదీలు, అందులో జరిగిన చర్చ, ఇతర అంశాల వివరాలను కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న ‘పీసీ ఘోష్‌ కమిషన్‌’కు అందజేసినట్లు చెప్పారు. కేబినెట్‌ నిర్ణయాల కంటే శాసనసభ ఆమోదం మరింత ఉత్తమం అని వ్యాఖ్యానించారు. 

బీఆర్‌ఎస్‌ నేతలు సి.లక్ష్మారెడ్డి, సు«దీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం 11 గంటలకు పీసీ ఘోష్‌ కమిషన్‌ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారాన్ని హరీశ్‌రావు అందజేశారు. అనంతరం బీఆర్‌కే భవన్‌ వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘కమిషన్‌కు మా వద్ద ఉన్న అదనపు సమాచారం అందజేశాం. ఈ అంశానికి సంబంధించిన డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్ద ఉన్నందున గతంలో తీసుకున్న కేబినెట్‌ నిర్ణయాలు, కేబినెట్‌ నోట్‌ తదితర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ, నీటిపారుదల శాఖ కార్యదర్శులకు లేఖలు రాసినా స్పందన లేదు. 

దీంతో మాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి నోట్‌ అందజేశాం. ప్రభుత్వం వద్ద పూర్తి వివరాలు ఉన్నా కమిషన్‌కు అందజేసిన సమాచారం మాకు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకుండా కమిషన్‌ను తప్పుదోవ పట్టించేలా వివరాలు ఇస్తోందని మాకు అనుమానాలు ఉన్నాయి’అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. 

సీఎంది కవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌.. 
‘సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌ వేదికగా 50 ఏండ్ల ద్రోహ చరిత్రపై ఇచ్చింది పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కాదు. అది ‘కవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌’. కృష్ణా నదీ జలాల్లో గత ప్రభుత్వం 299ః512 నిష్పత్తిలో వినియోగానికి శాశ్వత ఒప్పందం చేసుకుని సంతకాలు పెట్టిందని రేవంత్‌ పదేపదే పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఉమ్మడి ఏపీలో జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి చేతగాని నాయకుల వల్లే తెలంగాణకు 299 టీఎంసీలు తాత్కాలికంగా కేటాయించారు. ఆ అన్యాయాన్ని సరిదిద్దేందుకు కేసీఆర్‌ కేంద్రంతో పోరాడి సెక్షన్‌ 3ని సాధించి 763 టీఎంసీల వాటా కోసం పోరాటానికి బాటలు వేశారు.

కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే 299 టీఎంసీలు చాలు అంటూ రేవంత్, ఉత్తమ్‌ సంతకాలు చేసి వచ్చారు. నదుల బేసిన్స్‌ గురించి బేసిక్స్‌ తెలియని సీఎం రేవంత్‌.. అహంకారం, వెటకారం వదిలి తెలంగాణకు ఉపకారం చేసే రీతిలో నడుచుకోవాలి. కాకతీయులు, నిజాం నవాబుల కాలంలో నిర్మించిన చెరువులు, ప్రాజెక్టులను కూడా రేవంత్‌ కాంగ్రెస్‌ ఖాతాలో వేసి 54 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్తున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 48 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే అంతకు మునుపు పదేళ్లలో కాంగ్రెస్‌ ఇచ్చింది ఆరు లక్షల ఎకరాలకు మాత్రమే’అని హరీశ్‌రావు వివరించారు. 

తమ్మిడిహెట్టిపైనా అబద్ధాలే.. 
‘తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పినందునే మేడిగడ్డకు బరాజ్‌ మారిందని చెప్తున్నా సీఎం రేవంత్‌ పదేపదే అబద్ధాలు చెప్తున్నారు. జలాశయాల సామర్థ్యం, నీటి వినియోగం, ఆయకట్టు, పంపింగ్‌ సామర్థ్యం, భూసేకరణ పరిహారం పెరగడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెరిగాయి. గత ఏడాది తెలంగాణ వాటాలో కేవలం 28 శాతం కృష్ణా జలాలను వాడుకుని, చంద్రబాబుకు గురుదక్షిణగా 65 టీఎంసీలు ఆంధ్రాకు మళ్లించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అన్ని ఆధారాలతో వస్తాం. దమ్ముంటే సీఎం రేవంత్‌కు నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలి. కానీ ఒక్కటే షరతు.. మైక్‌ కట్‌ చేసి అసెంబ్లీని వాయిదా వేసి పారిపోవద్దు’అని హరీశ్‌రావు సూచించారు. ప్రఖ్యాత ఇంజనీర్‌ నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ జయంతి సందర్భంగా హరీశ్‌రావు నివాళి అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement