
శక్తిమంతమైన పాత్రల్లో రమ్యకృష్ణ ఏ స్థాయిలో విజృంభించగలరో చెప్పడానికి ‘రాజమాత శివగామి’ పాత్ర ఒక ఉదాహరణ. ‘బాహుబలి’లోని ఆ పాత్రను రమ్యకృష్ణ మాత్రమే చేయగలరు అనేలా ఆమె నటించారు. ఇప్పుడు ఈ పాత్ర ప్రస్తావన ఎందుకంటే... మరోసారి ఈ తరహా పవర్‌ఫుల్ రోల్‌లో రమ్యకృష్ణ కనిపించనున్నారట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలోని ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేయాలంటూ రమ్యకృష్ణను సంప్రదించారట అట్లీ. రమ్యకృష్ణ కూడా తన అంగీకారం తెలి పారని సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పలు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని భోగట్టా. అలాగే మొత్తం ఐదుగురు కథానాయికలు ఉంటారని సమాచారం. హీరోయిన్ దీపికా పదుకోన్ నటిస్తున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇంకా మృణాల్ రాకూర్, రష్మికా మందన్నా, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక భారీ ఎత్తున వీఎఫ్‌ఎక్స్ ఉన్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది.