
అర్ధాంతరంగా నిలిచిపోయిన ‘లగచర్ల’భూ సేకరణ
సంగారెడ్డి జిల్లా డప్పూరులో నిలిచిన ఫార్మా విలేజ్ ప్రతిపాదన
మిగతా జిల్లాల్లోనూ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం
హైదరాబాద్ ఫార్మా సిటీ భూములు ఇతర అవసరాలకు కేటాయింపు?
ఫార్మా విలేజ్‌ల ఏర్పాటు జరగకుంటే బల్క్‌డ్రగ్ పరిశ్రమపై ప్రభావం
ఫార్మా పెట్టుబడులు కర్ణాటకకు తరలుతున్నాయంటూ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫార్మా విలేజ్‌ల ఏర్పాటుకు భూ సేకరణ సవాలుగా మారింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఫార్మా విలేజ్ ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలోనూ ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ విడుదల చేసినా.. భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మిగతా చోట్ల ఫార్మా విలేజ్‌ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు, భూమి లభ్యతను గుర్తించే దశలోనే అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు కోసం సేకరించిన 13వేల ఎకరాల భూమిని ఫ్యూచర్ సిటీతోపాటు యంగ్ ఇండియా యూనివర్సిటీ వంటి ఇతర అవసరాలకు ప్రభుత్వం కేటాయిస్తుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఫార్మా యూనిట్ల ఏర్పాటుకు భూకేటాయింపుల కోసం పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు.
పది ఫార్మా విలేజ్‌లకు ప్రతిపాదన
ఫార్మారంగానికి రాష్ట్రాన్ని అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఫార్మా విలేజ్‌లు (లైఫ్ సైన్సెస్ హబ్)లు ఏర్పాటు చేస్తామని 2024 ఫిబ్రవరి 27న జరిగిన బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు వేల నుంచి మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా విలేజ్‌ల ఏర్పాటుకు 20వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేశారు.
తొలి దశలో లగచర్ల, న్యాల్‌కల్‌లో..
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలో ఫార్మా విలేజ్ కోసం భూ సేకరణకు 2024 జూలై 19న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. లగచర్ల, దుద్యాలలో 580 మంది రైతుల నుంచి 1,358 ఎకరాలు సేకరిస్తామని చెప్పింది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం డప్పూరు, వడ్డి, మల్గి గ్రామాల్లోనూ మరో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు అవసరమయ్యే 2003.39 ఎకరాల భూ సేకరణకు 2024 ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల చేశారు.
అయితే ఫార్మా విలేజ్‌తో తాము ఉపాధి కోల్పోతామని లగచర్ల రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. అయితే ఫార్మా విలేజ్‌కు బదులుగా ‘మలీ్టపర్పస్ ఇండ్రస్డియల్ పార్కు’ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి 1,358 ఎకరాల భూసేకరణకు గత నవంబర్ 29న మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.
మల్టీపర్పస్ ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటు భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కాగా, మరో 150 ఎకరాల మేర సేకరించాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇదిలాఉంటే న్యాల్‌కల్‌లోనూ రైతుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఇతర జిల్లాల నుంచి ఫార్మా విలేజ్‌ల ఏర్పాటుకు అవసరమైన భూమి లభ్యతకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని టీజీఐఐసీ వర్గాలు చెప్తున్నాయి.
హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు పైనా..
రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల పరిధిలో 19వేల ఎకరాల్లో హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటివరకు 11వేల ఎకరాల మేర భూ సేకరణ జరగ్గా, ఇందులో కొన్ని న్యాయపర వివాదాలు సాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మా సిటీ లక్ష్యాన్ని పునర్‌నిర్వచిస్తూ గ్రీన్ ఫార్మాసిటీతోపాటు సకల హంగులతో కూడిన ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
ఇందులో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ, ఏఐ సిటీ వంటి ప్రాజెక్టులను ప్రకటించింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను అదే అవసరాలకు ఉపయోగించాలని లేని పక్షంలో తమ భూములు తిరిగి అప్పగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఓ వైపు ఫార్మా విలేజ్‌లకు భూసేకరణ క్లిష్టంగా మారుతుండగా, మరోవైపు పొరుగునే ఉన్న కర్ణాటక ఫార్మా పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి.