
న్యూఢిల్లీ: చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యా కుసుమం నేల రాలింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. వర్శిటీకి చెందిన బిటెక్ విద్యార్థి శివమ్ డే(24) తన హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు. ఈ ఘటన దరిమిలా విశ్వవిద్యాలయంలో విషాదఛాయలు అలముకున్నాయి.
బీహార్‌లోని మధుబనికి చెందిన శివమ్.. వర్శిటీలోని హెచ్‌ఎంఆర్ హాస్టల్‌లో ఉంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఫోరెన్సిక్ బృందం శివమ్ గదిని పరిశీలించింది. అక్కడ శివమ్ రాసిన లేఖ పోలీసులకు దొరికింది. దానిలో శివమ్ ‘మీరు దీనిని చదివే సమయానికి నేను చనిపోయివుంటాను. నా మరణం నా సొంత నిర్ణయం. ఇందులో ఎవరికీ సంబంధం లేదు. నేను ఒక ఏడాదిగా ఇందుకోసం ప్లాన్ చేస్తున్నాను. రెండేళ్లుగా తరగతులకు హాజరు కావడం లేదు. నా ఫీజులను నా కుటుంబానికి తిరిగి చెల్లించండి. భారతదేశ విద్యా వ్యవస్థ నిరాశాజనకంగా ఉంది. దీనిని పరిష్కరించకపోతే, దేశం పురోగతి సాధించలేదు. నా అవయవాలను అవసరమైనవారికి దానం చేయండి’ అని శివమ్ ఆ లేఖలో రాశాడు.
కుమారుని ఆత్మహత్య గురించి తెలుసుకున్న శివమ్ కుటుంబసభ్యులు.. తమ కుమారుడు రెండేళ్లుగా తరగతులకు హాజరు కాకుంటే, ఆ విషయాన్ని తమకు ఎందుకు చెప్పలేదని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కాగా శారదా యూనివర్సిటీలో గత నెలలో రెండవ ఏడాది దంత విద్యార్థిని హాస్టల్‌లో బలవన్మరణానికి పాల్పడింది. ఫ్యాకల్టీ వేధింపులపై ఆరోపణలు చేస్తూ ఆమె ఒక లేఖ రాసింది. ఈ ఘటన క్యాంపస్‌లో నిరసనలకు దారితీసింది. ఈ కేసు నేపధ్యంలో ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. శివమ్ ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.