మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా మృతితో మావోయిస్టు ఉద్యమంపై గట్టి దెబ్బ పడింది. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో హిడ్మా హతమయ్యారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మడావి హిడ్మా పేరు వినిపించేది. ఆయనను పట్టుకోవడం చాలా కష్టమని, హిడ్మా ఎప్పటికప్పుడు నివాస ప్రాంతాలు మారుస్తుంటారని చెబుతుంటారు. ఇంతకీ మడావి హిడ్మా మావోయిస్టుల ఉద్యమాన్ని ఏవిధంగా ముందుకు నడిపారు? ఇందుకోసం ఎటువంటి విధానాలను ఆశ్రయించారనే వివరాల్లోకి వెళితే..
మూడంచెల భద్రతావ్యవస్థ
హిడ్మాకు మూడంచెల భద్రతావ్యవస్థ ఉండేదని చెబుతారు. దగ్గరగా ఉండే టీమ్-Aలో 10 మంది సభ్యులు, మధ్యలో ఉండే టీమ్-Bలో 20 మంది, వెలుపలి రక్షణ వలయంలో 15 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. దళంలో ఇతరులకు వండే ఆహార పదార్థాలను హిడ్మా తినడని, ఆయనకు ప్రత్యేకంగా వంట తయారు చేస్తారని చెబుతారు. హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం ఇద్దరు సభ్యులు ప్రత్యేకంగా ఉంటారని ప్రచారం. ఎక్కడైనా క్యాంప్ వేసినా అందరితో కలివిడిగా ఉండకపోగా, ప్రత్యేక క్యాంపులో ఉంటారు. హిడ్మాను ఎవరైనా కలవాలంటే ఆయన వ్యక్తిగత సహాయకుల ద్వారా సంప్రదించాలని సమాచారం. కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం ఆరు నెలలకోసారి కూడా హిడ్మా కనిపించడట. దండకారణ్య ప్రాంతం హిడ్మా అడ్డాగా ఉందని చెబుతారు.

ఏ భారీ దాడి జరిగినా..
ఇటు సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ టార్గెట్‌గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మా లోయలో జరిపిన దాడిలో హిడ్మా కీలకపాత్ర పోషించారు. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్‌తో పాటు 27 మంది చనిపోయారు. నాటి ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక చాన్నాళ్ల తర్వాత 2021 ఏప్రిల్‌లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్‌స్టేషన్ పరిధిలో అంబూష్ చేశారు. ఈ ఘటనలో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన భద్రతాదళాల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఘటన తర్వాత హిడ్మా పేరు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా ఆరాన్‌పూర్ దగ్గర ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో 10 డీఆర్‌జీ జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత భద్రతాదళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మానే ఉన్నాడనే ప్రచారం జరగడం సర్వసాధారణమైంది.
అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు
అటు హిడ్మా సొంతూరు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువ్వర్తి. ఆయన మురియా తెగకు చెందిన ఆదివాసీ. బాలసంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా విప్లవ భావాలను నరనరాన ఒంట బట్టించుకున్నారు. పదోతరగతి వరకే చదివినా.. ఇంగ్లిష్‌లో గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలడు. ఇక మావోయిస్టులు నడిపే స్కూల్‌లో చదువుతూ భద్రన్న నేతృత్వంలో సాయుధపోరులో తొలి అడుగులు వేశాడు. ఆపై జేగురుగొండ ఏరియా దళ కమాండర్‌గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్‌లో జరిగిన టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచాడు. ఈ దాడిలో 76 మంది CRPF జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తర్వాత మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నారు. గెరిల్లా పోరులో హిడ్మాకు మెళకువలు నేర్పింది కూడా చలపతే. ఇలా ఒక మెట్టు తర్వాత మరో మెట్టు ఎక్కుతూ వచ్చిన హిడ్మా అనేక మావోయిస్టు ఆపరేషన్లను ముందుండి నడిపారు. ఇప్పుడు హిడ్మా మృతితో మావోయిస్టు ఉద్యమానికే పెద్ద దెబ్బపడినట్లయ్యింది.
ఇది కూడా చదవండి: హిడ్మా స్కెచ్ వేస్తే.. మావోయిస్టుల మాస్టర్ మైండ్ హ(ఖ)తం


