
బహుళ అంతస్తుల భవన నిర్మాణదారులకు హైకోర్టు స్పష్టీకరణ
ఇష్టారాజ్యంగా బిల్డర్ల నిర్మాణాలు
ఇలాంటి వాటిని ప్రోత్సహించలేం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ అధికారులిచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) సమర్పించకుండా బహుళ అంతస్తుల భవనాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం కుదరదని హైకోర్టు తేల్చిచెప్పింది. బిల్డర్లు తరచూ.. ఆమోదించిన ప్లాన్ మార్చి నిర్మాణం చేస్తున్నారని, చట్టవిరుద్ధంగా అదనపు అంతస్తులు కడుతున్నారని, ఆ తర్వాత క్రమబద్ధీకరణకు కోరుతున్నారని.. ఇవన్నీ ఉల్లంఘనలేనని వ్యాఖ్యానించింది. గతంలో తాము ఇచ్చిన సడలింపులను దుర్వినియోగపరిస్తే మౌనంగా ఉండలేమని తేల్చిచెప్పింది.
ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే సమర్థించలేమని హైకోర్టు పేర్కొంది. సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించలేమని స్పష్టం చేసింది. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నుంచి ఓసీ పొందాలని ఓ కేసులో పిటిషనర్‌ను ఆదేశించింది. అది సమర్పించిన తర్వాతే టీజీఎస్‌పీడీసీఎల్ విద్యుత్ కనెక్షన్ ఇస్తుందని చెప్పింది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని తన భవనానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు ఓసీ కోసం పట్టుబట్టకుండా టీజీఎస్‌పీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహమ్మద్ ఆరిఫ్ రిజ్వాన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. స్టిల్ట్‌తో పాటు ఐదు అంతస్తుల నిర్మాణం జీహెచ్‌ఎంసీ మంజూరు చేసిన ప్రణాళిక ప్రకారమే జరిగిందన్నారు. అన్ని చార్జీలు చెల్లించిన తర్వాతే విద్యుత్ కనెక్షన్‌కు అనుమతి కోరామని చెప్పారు. టీజీఎస్‌పీడీసీఎల్ తరఫు న్యాయవాది శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గతంలో ఓసీ సడలింపులకు అధికారులు అనుమతి ఇవ్వడంతో చాలా మంది లబ్ధిదారులు ఆ తర్వాత కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పించలేదన్నారు.
విద్యుత్ కనెక్షన్ పొంది సరఫరాను అనుభవిస్తున్నారని.. దీంతో ఈ ఏడాది జనవరిలో టీజీఎస్‌పీడీసీఎల్ ఓ సర్క్యులర్ జారీ చేసిందన్నారు. దీని ప్రకారం 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలకు విద్యుత్ సేవలకు ఓసీ తప్పనిసరి చేసిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఉల్లంఘనలను ప్రోత్సహించేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు.