breaking news
Occupancy Certificate
-
‘ఓసీ’తో మాయ చేసి..
సాక్షి, సిటీబ్యూరో: అదో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. హైదరాబాద్ నగర శివార్లలోని ఆ గేటెడ్ కమ్యూనిటీలో సుమారు వందల సంఖ్యలో విల్లాల నిర్మాణం చేపట్టారు. వాటిలో చాలావరకు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని తుది దశ నిర్మాణంలో ఉన్నాయి.హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలకు అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను (ఓసీ) కూడా అందజేశారు. దీంతో అక్కడ చాలా మంది నివాసం ఉంటున్నారు. నిబంధనల మేరకు ఒకసారి ఓసీ తీసుకున్న తర్వాత ఎలాంటి అక్రమ నిర్మాణాలు, అడ్డగోలు కట్టడాలు చేపట్టడానికి అవకాశం లేదు. కానీ కొన్ని విల్లాలకు చెందిన యజమానులు ఇష్టారాజ్యంగా నిబంధనలను బేఖా తరు చేస్తూ అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మేరకు కొందరు స్థానికులు హెచ్ఎండీఏకు సైతం ఫిర్యాదు చేశారు. కానీ ఇలాంటి అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోవడం గమ నార్హం. ఒక్క గేటెడ్ కమ్యూనిటీల్లో కాదు. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు తదితర అ న్ని నిర్మాణాల్లోనూ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పొందిన తర్వాత ఉల్లంఘనలకు పాల్పడటం గమనార్హం. వెల్ఫేర్ సంఘాల పేరిట ఉల్లంఘన.. శ్రీశైలం రహదారికి సమీపంలోని మరో భారీ గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని విలాసవంతమైన విల్లాలు (Luxury villas) ఉన్నాయి. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ తారలు, డైరెక్టర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వ్యాపారులు, ఎన్నారైలు తదితర వర్గాలకు చెందిన వారు విల్లాలను నిర్మించుకున్నారు.కొంతమంది సామాన్యులు కూడా ఊళ్లల్లోని ఆస్తులను అమ్ముకుని పిల్లల చదువు కోసం ఇందులో ప్లాటు కొనుక్కొని నివసిస్తున్నారు. కమ్యూనిటీ అంతటికీ ప్రాతినిధ్యం వహించేందుకు ఏర్పడిన వెల్ఫేర్ అసోసియేషన్లు సొంత నియమ నిబంధనలను రూపొందించుకొని హెచ్ఎండీఏ నిబంధనలను నీరుగారుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా నిర్మించుకునే వాళ్లు హెచ్ఎండీఎ నిబంధనల ప్రకారం నిర్మాణాలను కొనసాగిస్తుండగా, ఇప్పటికే భవనాలు పూర్తి చేసుకున్న వాళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి అదనపు భవనాలను నిర్మిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘అసోసియేషన్లకు ప్రాతినిధ్యం వహించేవారే హెచ్ఎండీఏ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం నిర్మాణాలు కొనసాగిస్తున్నారు’ అని హెచ్ఎండీఏ కమిషనర్‌కు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసోసియేషన్ నిబంధనల పేరిట 2 శాతం అక్రమ నిర్మాణాలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడం గమనార్హం.కొరవడిన నిఘా.. సాధారణంగా ఒకసారి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (occupancy certificate) అందజేసిన తర్వాత ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా నియంత్రించాల్సిన బాధ్యత స్థానిక మున్సిపాలిటీలు లేదా గ్రామ పంచాయతీలు తదితర స్థానిక సంస్థల పరిధిలో ఉంటుంది.ఇలాంటి ఫిర్యాదులపై హెచ్ఎండీఏ అధికారులు సైతం స్థానిక సంస్థలను అప్రమత్తం చేసి అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు హెచ్ఎండీఏకు చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో పాటు, స్థానిక మున్సిపాలిటీలు, రెవెన్యూ అధికారులు, పోలీసులు సమన్వయంతో చర్యలు చేపట్టవచ్చు.మియాపూర్, శంషాబాద్ తదితర భూముల పరిరక్షణలో హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగం స్థానిక సంస్థలతో కలిసి చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏతో పాటు స్థానిక సంస్థలు సమన్వయంతో పని చేశాయి. 500 గజాల నుంచి 1000 గజాల లోపు బహుళ అంతస్తుల భవనాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.కొంతకాలంగా హెచ్ఎండీఏ (HMDA) విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్విర్యమైంది. హెచ్ఎండీఏకు చెందిన ప్లానింగ్, ఎస్టేట్ తదితర విభాగాలకు సహకరించేందుకు మాత్రమే పరిమితమైంది. ఈ క్రమంలో అన్ని చోట్ల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పొందిన తర్వాత యథావిధిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రణాళికా విభాగానికి చెందిన కొందరు అధికారులే ఈ మేరకు భవన యజమానులకు ఉచిత సలహాలు ఇస్తున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏకు, స్థానిక సంస్థలకు మధ్య సమన్వయం లేకపోవడంతో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకొనే వ్యవస్థలు పని చేయడం లేదు. -
ఓసీ లేకుండా విద్యుత్ కనెక్షన్ కుదరదు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ అధికారులిచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) సమర్పించకుండా బహుళ అంతస్తుల భవనాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం కుదరదని హైకోర్టు తేల్చిచెప్పింది. బిల్డర్లు తరచూ.. ఆమోదించిన ప్లాన్ మార్చి నిర్మాణం చేస్తున్నారని, చట్టవిరుద్ధంగా అదనపు అంతస్తులు కడుతున్నారని, ఆ తర్వాత క్రమబద్ధీకరణకు కోరుతున్నారని.. ఇవన్నీ ఉల్లంఘనలేనని వ్యాఖ్యానించింది. గతంలో తాము ఇచ్చిన సడలింపులను దుర్వినియోగపరిస్తే మౌనంగా ఉండలేమని తేల్చిచెప్పింది. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే సమర్థించలేమని హైకోర్టు పేర్కొంది. సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించలేమని స్పష్టం చేసింది. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నుంచి ఓసీ పొందాలని ఓ కేసులో పిటిషనర్‌ను ఆదేశించింది. అది సమర్పించిన తర్వాతే టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ కనెక్షన్ ఇస్తుందని చెప్పింది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని తన భవనానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు ఓసీ కోసం పట్టుబట్టకుండా టీజీఎస్పీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహమ్మద్ ఆరిఫ్ రిజ్వాన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. స్టిల్ట్తో పాటు ఐదు అంతస్తుల నిర్మాణం జీహెచ్ఎంసీ మంజూరు చేసిన ప్రణాళిక ప్రకారమే జరిగిందన్నారు. అన్ని చార్జీలు చెల్లించిన తర్వాతే విద్యుత్ కనెక్షన్‌కు అనుమతి కోరామని చెప్పారు. టీజీఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గతంలో ఓసీ సడలింపులకు అధికారులు అనుమతి ఇవ్వడంతో చాలా మంది లబ్ధిదారులు ఆ తర్వాత కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పించలేదన్నారు. విద్యుత్ కనెక్షన్ పొంది సరఫరాను అనుభవిస్తున్నారని.. దీంతో ఈ ఏడాది జనవరిలో టీజీఎస్పీడీసీఎల్ ఓ సర్క్యులర్ జారీ చేసిందన్నారు. దీని ప్రకారం 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలకు విద్యుత్ సేవలకు ఓసీ తప్పనిసరి చేసిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఉల్లంఘనలను ప్రోత్సహించేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. -
చెత్త తొలగించకపోతే సస్పెన్షన్
- అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరిక సాక్షి, సిటీబ్యూరో: నగర రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయిన చెత్త కుప్పలు.. ఇతర త్రావ్యర్థాలను రెండు రోజుల్లోగా తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులకు హుకుం జారీ చేశారు. తొలగించడంలో విఫలమైన వారిని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. నగరంలోని ప్రధాన రోడ్లపై సైతం గుట్టలు.. గుట్టలుగా చెత్త పేరుకుపోవడంతో ఆగ్రహం చెందిన క మిషనర్.. సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నా సరే జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం అధికారులు తమ ప్రధాన విధి అయిన చెత్త తరలింపు పనులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ స్థాయిల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పెషల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లంతా ఇకనుంచి ప్రతి ఉదయం క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలని ఆదేశించారు. చెత్త తరలింపు పనులకు ప్రథమ ప్రాధాన్యత నివ్వాలన్నారు. రహదారులు ఊడ్చే పనులు కూడా మెరుగుపడాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూళ్లపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందినప్పటి నుంచీ వసూలు చేయాలని, ఆస్తిపన్నుకు సంబంధించిన డేటాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సర్కిల్ స్థాయిలో టాప్ 250 డిఫాల్టర్లు, కోర్టు వివాదాలు, డబుల్ ఎంట్రీలు, రివిజన్ పిటిషన్లు, జీరో అసెస్మెంట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డిమాండ్ బిల్స్ 15 రోజుల్లోగా పంపిణీ చేసే బిల్కలెక్టర్లకు బిల్‌కు రూ. 5లు వంతున, ఆ తర్వాత పంపిణీ చేసే వాటికి రూ. 3 లు వంతున చెల్లిస్తామన్నారు. హోర్డింగులపైనా ఆస్తిపన్ను వసూలు చేయాలని, సెల్ టవర్లకు ఆస్తిపన్ను వసూలు చేసేందుకు తగిన నిబంధనలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.