
ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ ఇటీవల ఒక ట్రెండ్‌గా మారింది. ఈ కళలోని ప్రత్యేక ఆకర్షణ అనేక సృజనాత్మక ఆలోచనలకు రూపం ఇస్తోంది. మనసుకు నచ్చిన కళాఖండాలతో ఇంటి అలంకరణను మార్చుకోవడానికి ఈ ఆర్ట్ వీలు కల్పిస్తుంది. అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్స్, ఫంక్షనల్ డెకర్ లేదా ఫ్యాన్సీ వస్తువులైనా ఎపాక్సీ రెసిన్ కళ ఇంటికి కొత్త అందాన్ని తీసుకురాగలదు. రెసిన్‌ను ప్లాస్టిక్, వార్నిష్ వంటి అంటుకునే పదార్థాలు, ఇతర ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఎపాక్సీ రెసిన్ అనేక పొరలతో కూడి ఉంటుంది.
గోడ మీద ప్రకృతి అందాలు
ఎపాక్సీ రెసిన్‌తో వాల్‌మీదకు ప్రకృతి దృశ్యాలను తీసుకురావచ్చు. నదీ నదాల అందాన్ని, నీటి కదలికను అనుకరించేలా, మంత్రముగ్ధులను చేసేలా ఈ ఆర్ట్ ద్వారా మన ముందుకు తీసుకువస్తున్నారు కళాకారులు.
వాడిపోని పూల సొగసు
సున్నితమైన పువ్వులను ఈ ఆర్ట్‌లో ఉపయోగించవచ్చు. పువ్వులను, కొమ్మలను ఎపాక్సీ రెసిన్‌తో కలిపితే అందమైన రూపం మీ ముందు ఉంటుంది. ఈ ప్రత్యేకమైన టెక్నిక్ పువ్వుల సహజ సౌందర్యాన్ని కాపాడుతుంది. అద్భుతమైన వాల్ హ్యాంగింగ్స్‌ను సృష్టించడానికి ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ మెటీరియల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎపాక్సీ రెసిన్‌తో గోడ గడియారాలు, పెయింటింగ్స్, హ్యాంగింగ్స్ వంటి ఎన్నో రకాల అలంకరణ వస్తువులను తయారు చేయవచ్చు.
డిజైనర్ ఫర్నిచర్
సముద్రపు గవ్వలు, గులకరాళ్లు, పువ్వులు, లతలు వంటి సహజ వస్తువులను నిగనిగలాడే ఎపాక్సీ రెసిన్‌తో టేబుల్ టాప్స్, చెయిర్స్‌కి అద్భుతమైన అందాన్ని తీసుకురావచ్చు.
ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ ఐడియాలు
ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ వాల్ ఆర్ట్, ఫర్నిచర్‌కు మాత్రమే పరిమితం కాదు. వేడుకలలో ప్రత్యేకంగా నిలిచే ట్రేలు, ఇతర డెకర్ ఉత్పత్తులను రెసిన్‌తో తయారు చేయవచ్చు. ఈ కస్టమైజ్డ్ డిజైన్స్‌కి మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది.
(చదవండి: మెట్లు దిగితే సముద్రం..! కళ కోసం అక్కడకు వెళ్లాల్సిందే..)