3 రోజుల పాటు కోస్తాలో అతి భారీ వర్షాలు | Heavy Rains In Andhra pradesh For Next 3 Days | Sakshi
Sakshi News home page

3 రోజుల పాటు కోస్తాలో అతి భారీ వర్షాలు

Aug 17 2025 5:32 AM | Updated on Aug 17 2025 10:42 AM

Heavy Rains In Andhra pradesh For Next 3 Days

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ ఛత్తీస్‌గడ్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రంలో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు, సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

ఆదివారం అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

19న కోస్తాంధ్ర అంతటా మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ప్రఖర్‌ జైన్‌ సూచించారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement