పోలవరం కొట్టుకుపోయినా ఎన్డీఎస్‌ఏకు కనిపించదా?: కేటీఆర్‌ | BRS Leader KTR Comments on Polavaram | Sakshi
Sakshi News home page

పోలవరం కొట్టుకుపోయినా ఎన్డీఎస్‌ఏకు కనిపించదా?: కేటీఆర్‌

Aug 17 2025 6:23 AM | Updated on Aug 17 2025 6:23 AM

BRS Leader KTR Comments on Polavaram

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

పోలవరం కాఫర్‌ డ్యామ్‌కు రహస్య మరమ్మతులు ఎందుకు? 

20 నెలలు కావస్తున్నా మేడిగడ్డకు మరమ్మతులు ఎందుకు లేవు?

సాక్షి, హైదరాబాద్‌: సాక్షాత్తు ఎన్డీయే ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చి మరీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యామ్‌     రెండోసారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్‌ఏకు కనిపించడం లేదా? అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే ‘కూలేశ్వరం’అని కారుకూతలు కూసిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు పోలవరంను.. ‘కూలవరం’అనే ధైర్యం ఉందా? అని శనివారం ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. 

‘తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి, పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా? అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే ఎన్డీఎస్‌ఏను దించి బీఆర్‌ఎస్‌పై బీజేపీ నేతలు బురదజల్లారు. కళ్లముందు రెండోసారి కొట్టుకుపోయినా పోలవరం కాఫర్‌ డ్యామ్‌పై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?’అని నిలదీశారు. 

‘ఏపీలో ఏకంగా పది అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్‌ డ్యామ్‌కు గుట్టుచప్పుడు కాకుండా యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బరాజ్‌ వద్ద మరమ్మతులు లేకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే. 2020లో పోలవరం డయాఫ్రం వాల్‌ రెండేండ్లకే కొట్టుకుపోయినా ఇప్పటికీ ఉలుకూ, పలుకూ లేదు. 

తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కుప్పకూలి 8 మంది మరణించినా ఇప్పటికీ ఎన్డీఎస్‌ఏ అడ్రస్‌ లేదు. పంజాబ్‌నే తలదన్నే స్థాయిలో తెలంగాణలో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించి, దేశానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్ర రైతును తీర్చిదిద్దిన కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుమీద కాంగ్రెస్, బీజేపీలు సాగిస్తున్న మూకుమ్మడి కుట్రలను కాలరాస్తాం. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటాం’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement