
ఎన్డీటీవీ యువ –2025లో మాట్లాడుతున్న కేటీఆర్
యువత ఆకాంక్షలను పాలకులు పట్టించుకోవాలి
పాక్‌తో కాదు.. పశ్చిమ దేశాలతో పోటీపడాలి
మందిరం, మసీదు కాదు.. మౌలిక వసతులే ముఖ్యం
తెలంగాణలో రీకాల్, రీగ్రెట్, రివోల్ట్ నడుస్తోంది
ఎన్డీటీవీ యువ –2025లో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: యువత ఆకాంక్షలను విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని అంటుతుండగా పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ మందిర్– మస్జిద్ పేరిట ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారని మండిపడ్డారు.
ముంబైలో శనివారం సాయంత్రం జరిగిన ‘ఎన్డీటీవీ యువ 2025’సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. ‘దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రధాని మోదీ గాలికొదిలేశారు. చైనా, జపాన్‌తోపాటు అమెరికా వంటి పశ్చిమ దేశాలను అధిగమించే ప్రయత్నం చేయకుండా మనకంటే వెనుకబడిన దేశాలతో పోల్చుకుని సంతృప్తి చెందడం సరికాదు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
జెన్ జీ శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు
‘ప్రస్తుత తరం యువత (జెన్–జీ) కేవలం డిజిటల్ మీడియాకే పరిమితం కాకుండా సమాజం పట్ల అపారమైన బాధ్యతతో పనిచేయాలి. జెన్ జీ శక్తిని పాలకులు తక్కువగా అంచనా వేయొద్దు. తెలంగాణలో 400 ఎకరాల అటవీ భూమిని అమ్మే ప్రభుత్వ ప్రయత్నాలు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటంతో నిలిచిపోయింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువత రాజకీయాల్లోకి వచ్చి భవిష్యత్తు నిర్ణేతలు కావాలి. దేశంలోని యువశక్తిని దేశ నిర్మాణానికి వాడుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. అణుబాంబు దాడితో సర్వనాశనమైన జపాన్ కేవలం 23 ఏళ్లలోనే విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించింది’అని కేటీఆర్ గుర్తు చేశారు.
పదేళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ
‘గడిచిన పదేళ్లలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతోపాటు అమెజాన్¯ అతిపెద్ద క్యాంపస్, అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ వంటివి తెలంగాణలో సాధ్యమయ్యాయి. ఇదే రీతిలో మిగతా భారతదేశం ఎందుకు చేయలేకపోయింది. మనదేశంలోని 38 కోట్ల జెన్–జీ యువత సరికొత్త ఆలోచనలతో ప్రపంచ గతిని మార్చేందుకు ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి. ప్రస్తుతం తెలంగాణలో రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ నడుస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును బీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు పోల్చి (రీకాల్) చూసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోనందుకు (రిగ్రెట్) బాధపడుతున్నారు. త్వరలోనే అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడే (రివోల్ట్)కు అవకాశం ఉంది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రహదారి భద్రతా సెస్ పేరుతో ప్రజలపై భారం వేస్తారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రహదారి భద్రతా సెస్ పేరుతో ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు అదనపు భారం వేయాలని చూడటం పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని దగా చేయడమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే.. వాటిని అమలు చేయాల్సింది పోయి వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ఏమిటని ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పైసా పైసా కూడబెట్టుకుని, లేదా అప్పు చేసి వాహనాలు కొనుగోలు చేసే పేద, మధ్యతరగతివారి జేబులు కొట్టే ఇలాంటి పన్నాగాలకు కాంగ్రెస్ సర్కారు ఇకనైనా స్వస్తి పలకాలని, రాష్ట్ర బడ్జెట్ నుంచి రోడ్ సేఫ్టీకి నిధులు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.