
రీజినల్ రింగు రోడ్డు బాధితుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం: కేటీఆర్
నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, గజ్వేల్ బాధితులతో భేటీ
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రీజినల్ రింగు రోడ్డు(ట్రిపుల్ ఆర్) అలైన్‌మెంట్ మార్పుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రీజినల్ రింగు రోడ్డు మూలంగా ఎవరికీ నష్టం జరగకుండా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాం«దీతో ఎన్నికల ముందు హామీలు ఇప్పించారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీని పూర్తిగా మరిచిపోయిందని మండిపడ్డారు. రీజినల్ రింగు రోడ్డు అలైన్‌మెంట్ మార్పుతో నష్టపోతున్న నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతోపాటు సంగారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన బాధితులు సోమవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు.
మాజీమంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలైన్‌మెంట్ మార్పుతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. బీఆర్‌ఎస్ పాలనలో ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి వ్యవసాయరంగాన్ని సుభిక్షం చేశాం. గతంలో భూసేకరణ సమస్యలు ఎదురైనప్పుడు మా ప్రభుత్వం నేరుగా రైతులతో చర్చలు జరిపి పునరావాసం కల్పించడంతోపాటు శాశ్వత పరిష్కారాలు చూపించింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు విషయంలోనూ, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ విషయంలోనూ అలైన్‌మెంట్లు మార్చి పేదల, రైతుల జీవితాలను ఆగం చేస్తోంది’అని కేటీఆర్ ఆరోపించారు.
ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పుతో నష్టపోతున్న వారికి బీఆర్‌ఎస్ అండగా నిలవడంతోపాటు అసెంబ్లీ, పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం. అలైన్‌మెంట్ శాశ్వతంగా జరిగేంత వరకు బీఆర్‌ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు తమ డిమాండ్లను సాధించుకోవడానికి ఐకమత్యం ప్రదర్శించాలి. గ్రామ గ్రామాన తీర్మానాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక దిగి వస్తాయి’అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్ అనేది ‘జనతా గ్యారేజ్’.. అని రైతులు ఎప్పుడైనా తెలంగాణ భవన్‌కు వచ్చి న్యాయ నిపుణులను సంప్రదించవచ్చన్నారు.