
షెడ్యూల్ విడుదలతో వ్యూహాలకు పదును
70–80 శాతం సీట్లు గెలవాలన్నపట్టుదలతో కాంగ్రెస్.. ప్రభుత్వ వైఫల్యాలే బీఆర్‌ఎస్ ప్రచారా్రస్తాలు
కేంద్ర పథకాలపై బీజేపీ ఆశలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. మెజారిటీ స్థానాల్లో గెలిచి సత్తా చాటాలనే లక్ష్యంతో కసరత్తు ముమ్మరం చేశాయి. జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం సాధించేందుకు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌తోపాటు సర్వ శక్తులూ కూడదీసుకుంటున్నాయి. ఇతర పార్టీలు సైతం ఎన్నికలపై దృష్టి నిలిపాయి.
70–80 శాతం సీట్లు గెలిచేలా..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో కనీసం 70 నుంచి 80 శాతం స్థానాలు సాధించి మిగతా పార్టీలపై ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వ పాలన తీరుపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందని, కచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రుల పర్యవేక్షణలో పార్టీ ఎమ్మెల్యేలకు గెలుపు బాధ్యతలను అప్పగించనున్నారు. ఈ ఎన్నికల కోసం జిల్లాకు ఒక పరిశీలకుడిని నియమించనున్నారు. ఎన్నికల పర్యవేక్షణ, ప్రచార బాధ్యతలను సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు తీసుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు, పార్టీ బలపరిచేవారిని గెలిపించే పూర్తి బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలపైనే మోపేందుకు అధిష్టానం సిద్ధమైంది.
ఈ ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో జిల్లా కమిటీలను వేసి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా, ప్రజలకు సన్నబియ్యం పంపిణీ, సాదా బైనామాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన తదితరాలను ప్రచారాస్త్రాలుగా చేసుకోనుంది. గత బీఆర్‌ఎస్ పాలన తీరును ఈ ఎన్నికల్లో ఎండగడతామని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి స్థానిక అంశాలపై కూడా ప్రధానంగా దృష్టిపెడతామని అంటున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపైనే బీఆర్‌ఎస్ ఫోకస్
గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను లేవనెత్తి, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని ప్రజలకు చూపించాలని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ భావిస్తోంది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పల్లెల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటే, కాంగ్రెస్ వాటన్నింటినీ నిర్లక్ష్యం చేసిందని ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ వ్యూహంతోమంచి ఫలితాలు సాధిస్తామనే విశ్వాసాన్ని ముఖ్యనేతలు వ్యక్తంచేస్తున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే ఎన్నికల కసరత్తు చేపట్టేలా టెలి కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలవారీగా ఇతర పార్టీల నుంచి వచ్చిన అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకోవటంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
కేంద్ర పథకాలపైనే ఆశలు
స్థానిక ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా కేంద్ర పథకాలపైనే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశంగా భావిస్తోంది. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించింది. మండల, అసెంబ్లీ, జిల్లా స్థాయిల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లు ఇచ్చిందని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది.
కేంద్ర పథకాల వల్ల తెలంగాణకు వివిధ రూపాల్లో లభించిన ప్రయోజనాలు, వివిధ శాఖలు, రంగాలకు సంబంధించి అందిన సహాయం గురించి ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ముఖ్య నాయకులు హైదరాబాద్‌కు పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. పాలనలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయని బలంగా ప్రచారం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.