సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విచిత్రమైన పరిస్థితి కనిపించింది. సభలో ప్రతిపక్షం లేకున్నా ప్రభుత్వం తీరుపై విమర్శలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఈ పని చేశారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా.. కనీస స్పందన ఉండడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ శాసన సభలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలకు దిగారు. తమ నియోజకవర్గంలో బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, టెక్నీకల్ సమస్యలతో ఇబ్బందులు పెట్టొద్దని సభలో కొందరు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇస్తున్న ఇండ్లతో పాటు అదనపు ఇండ్లు మంజూరు చేయాలని మరికొందరు ఎమ్మెల్యేలు కోరారు. అయితే..
దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేసిందని చెప్పుకొచ్చారు. ‘‘గతంలో 200 కోట్లు డబుల్ బెడ్ ఇండ్లకు బిల్లులు బకాయిలు పెట్టారు. గత ప్రభుత్వంలో కేవలం పింక్ కలర్ వాళ్ళకే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారు. గత ప్రభుత్వ పెద్దలు దత్తత తీసుకున్న వాసల మర్రిలో హామీ నెరవేర్చలేదు.
రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేస్తాం. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న అంశంపై ప్రభుత్వం ద్రుష్టి సారించింది. ఇండ్ల స్థలం లేని పేదలకు స్థలంతో పాటు ఇళ్లను ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రవ్యాప్తంగా 52,000 ఇండ్లు ఇప్పటికే గృహప్రవేశాలు అయ్యాయి. అర్బన్ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వబోతున్నాం. గ్రేటర్ సిటీని మూడు కార్పొరేషన్లుగా పెద్దగా చేసుకోబోతున్నాం’’ అని అన్నారాయన.
అసెంబ్లీలో ఇవాళ కృష్ణా జలాల అంశంపై స్వల్ప కాలిక చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్న సమయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు సభలోని స్పెషల్ హాల్‌లో ఏర్పాట్లు చేశారు.


