సాక్షి, హైదరాబాద్: కృష్ఝా జలాలపై తెలంగాణలో పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఈ అంశంపై అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ జరుపుతుండగా.. దానికి కౌంటర్‌గా మరో పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు బీఆర్‌ఎస్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు సిద్ధం కావడంతో బీఆర్‌ఎస్ అధికార కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శనివారం తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు సిద్ధమయ్యాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు. అయితే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో కేటీఆర్, హరీష్‌రావు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం జరుగనుంది. హరీష్‌రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తారని ప్రచారం నడుస్తోంది.
కృష్ఝా జలాల పంపిణీ అంశంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ(షార్ట్ డిస్కషన్) ఇవాళ నిర్వహిస్తోంది. మధ్యాహ్నాం 12 గంటల సమయంలో సభలో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు స్పెషల్ స్క్రీన్‌ను ఇప్పటికే ఏర్పాటు చేశారు.
సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని.. తమకూ పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని, అలాగే యూరియా సహా ఇతర అంశాలపై చర్చించాలన్న డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో బీఆర్‌ఎస్ ఈ సెషన్‌ను బహిష్కరించింది. అయితే బీఆర్‌ఎస్‌లోనే అన్యాయం జరిగిందని.. తప్పులు బయటపడతాయనే సమావేశాలను బహిష్కరించిందని.. దమ్ముంటే సభకు రావాలని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది.
మంత్రి ఉత్తమ్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌పై హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. సంప్రదాయాలను కాంగ్రెస్ నేతలు తుంగలో తొక్కారు. మార్పు పేరుతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు’’ అని అన్నారు.


