అశ్వాపురం/వేంసూరు/పెనుబల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం రెండు విద్యా సంస్థల బస్సులు బోల్తా పడ్డాయి. అయితే, ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలైనా ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేఎల్‌ఆర్ కళాశాలకు శుక్రవారం ఉదయం వివిధ ప్రాంతాల విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు అశ్వాపురం మండలం మొండికుంట శివారులో వంతెన సమీపాన బోల్తా పడింది. బస్సు స్టీరింగ్ పని చేయకపోవడంతో అదుపు తప్పి వాగు వంతెన పక్కకు బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది.
ఘటనా సమయంలో 50 మంది విద్యార్థులు ఉండగా, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై రాజేష్ సిబ్బందితో చేరుకుని స్థానికుల సాయంతో 108 వాహనాల్లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో విద్యార్థులందరికీ గాయాలు కాగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, బస్సు బోల్తా పడిన సమయాన మణుగూరుకు చెందిన విద్యార్థి అంబికా చేయి బస్సులో ఇరుక్కొని విలవిల్లాడింది. అర గంట పాటు ఆమె నొప్పితో రోదిస్తుండగా జేసీబీల సాయంతో బస్సును పైకి లేపి ఆమెను బయటకు తీయాల్సి వచి్చంది. అయితే, ఈ బస్సు వంతెనకు కాస్త ముందు వాగులో బోల్తా పడితే ప్రాణాపాయం జరిగేదని స్థానికులు తెలిపారు. అయితే, ఫిట్‌నెస్ లేకపోవడంతో స్టీరింగ్ బ్రేక్ అయి ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
ఒకే బస్సులో వంద మంది..: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేషన్‌పాడు శివారు వీరబ్రహ్మాంద్ర స్వామి ఆలయం సమీపాన సాగర్ కాల్వలో వేంసూరు మండలం మొద్దులగూడెంకు చెందిన వివేకానంద పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిశాక విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 107 మంది వరకు విద్యార్థులు ఉండగా 20 మందికి గాయాలయ్యాయి. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లడమే కాక బస్ డ్రైవర్ ఆళ్ల నవీన్ మద్యం మత్తులో ఉండడమే ఘటనకు కారణమని తెలుస్తోంది.
బస్సు కాల్వలో పడగానే వచ్చిన శబ్దం, విద్యార్థుల కేకలు విని స్థానికులు చేరుకుని వారిని బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను తిరుపూరు, పెనుబల్లి ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదాలపై మంత్రులు ఆరా: ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో జరిగిన విద్యాసంస్థల బస్సు ప్రమాదాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులతో మాట్లాడిన వారు ప్రమాదాలకు కారణాలపై విచారణ చేపట్టాలన్నారు.


