
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠత వీడింది. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సతీమణిని అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ క్యాడర్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రమంతా ఒక తీరుగా ప్రజలు తీర్పునిస్తే హైదరాబాదులో మాత్రం బీఆర్ఎస్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా మార్చిన బీఆర్ఎస్‌ను అన్ని స్థానాల్లో గెలిపించారు. ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా జూబ్లీహిల్స్‌లో మూడోసారి మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారు. మాగంటి గోపీనాథ్ సేవల్ని కొనసాగిస్తామని ఆయన సతీమణి సునీత మీ ముందుకు వచ్చింది. అందరూ ఆమెను ఆశీర్వదించండి అని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.