
కృష్ణానదిపై కర్ణాటక కుట్రను నిలువరించే దమ్ముందా?
నల్లమల పులిగా చెప్పుకునే సీఎం రేవంత్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి
రాహుల్‌గాంధీ తనను ఎప్పుడు తీసేస్తాడోనన్న భయంలో ఉన్నాడు
ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం
సీఎం సొంత గడ్డ నుంచే స్థానిక ఎన్నికల శంఖారావం
అచ్చంపేటలో బీఆర్‌ఎస్ జనగర్జన బహిరంగ సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, నాగర్‌కర్నూల్: కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్ర చేస్తోందని, నల్లమల పులిగా చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఆల్మట్టి పనులు ఆపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీఆర్‌ఎస్ రోడ్‌షో నిర్వహించిన అనంతరం జరిగిన జనగర్జన బహిరంగసభలో మాట్లాడారు. ఆల్మట్టి నిర్మాణంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచే పోరాటం సాగిందన్నారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం రూ.70వేల కోట్లతో ఆల్మట్టి ఎత్తును 5 మీటర్లు పెంచేందుకు నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ఇదే జరిగితే కృష్ణానది నుంచి పాలమూరుకు ఒక్క చుక్కనీరు కూడా రాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి పనులు ఆపాలని కోరారు. నల్లమల పులిగా గర్జిస్తారా? లేక పిల్లిలా ఇంట్లో కూర్చుంటారా? సీఎం రేవంత్ తేల్చుకోవాలన్నారు. అప్పుడే ఆయన నల్లమల పులో లేక నక్కో తేలుతుందని చెప్పారు. రాహుల్‌గాంధీ తనను సీఎం పదవి నుంచి ఎప్పుడు తీసేస్తాడోనన్న భయంతో రేవంత్ గడుపుతున్నారన్నారు.
కేసీఆర్‌కు పేరొస్తదనే పాలమూరు ముట్టుకోవడం లేదు
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కింద చేపట్టిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు పూర్తయ్యాయని కేటీఆర్ చెప్పారు. ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి కాగా, మిగిలిన 10 శాతం పనులను సీఎం రేవంత్ రెండేళ్లు గడిచినా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఈ ప్రాజెక్టును ముట్టుకోవడం లేదన్నారు.
చరిత్రలో ఏ సీఎం ఇంత హీనంగా మాట్లాడలేదు
గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్ వంటి నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఏనాడూ సీఎం రేవంత్ తరహాలో హీనంగా మాట్లాడలేదని కేటీఆర్ చెప్పారు. గుడ్లతో గోటీలాడుతా.. పేగులు తీసి మెడలో వేసుకుంటానంటూ గలీజు మాటలు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రం దివాలా తీసిందని, కేన్సర్ పేషెంట్‌లా ఉందంటూ, తనను కోసినా రూపాయి రాదంటూ మాట్లాడటం ఆయన చిల్లర బుద్ధికి నిదర్శనమన్నారు.
స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
అచ్చంపేటలో ఎమ్మెల్యే ఓడినా కేసీఆర్ గెలుస్తారని ఇక్కడి ప్రజలు అనుకున్నారని, రాష్ట్రమంతా ఇలాగే అనుకునే మోసపోయారని కేటీఆర్ చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. గత ఏడాది మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు చేసి నోట్ల కట్టలు దొరికాయని వార్తలు వచ్చాయని, ఇప్పుడు ఈడీ, మంత్రి ఎవరూ నోరు విప్పడం లేదని చెప్పారు. దీనిని బట్టే కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని తెలుస్తోందన్నారు.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని.. కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. సభలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, జైపాల్‌యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డితోపాటు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.