నందినగర్‌లో జరిగిన రోడ్ షోలో మాట్లాడుతున్న కేటీఆర్
రేవంత్ సర్కారు హైడ్రా బుల్డోజర్‌తో వేల ఇళ్లు కూల్చింది
పేదల శాపాలే కాంగ్రెస్‌కు ఉరితాళ్లయి చుట్టుకుంటాయ్
4 లక్షల జూబ్లీహిల్స్ ఓటర్ల తీర్పుతో 4 కోట్ల ప్రజల గోస తీరుతుంది
పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?
షేక్‌పేట రోడ్ షోలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/గోల్కొండ: పేదల ఇళ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కేసీఆర్ లక్ష ఇళ్లు కడితే రేవంత్‌రెడ్డి సర్కారు హైడ్రా బుల్డోజర్‌తో వేల ఇళ్లు కూల్చిందని ఆరోపించారు. ఆ పేదల శాపాలే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉరితాళ్లై చుట్టుకుంటాయని దుయ్యబట్టారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పలుచోట్ల ఆయన రోడ్ షోలు నిర్వహించారు. తొలుత షేక్‌పేటలో ప్రచార వాహనం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం జీవో 58, 59 కింద 1.5 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చిందని గుర్తుచేశారు. ఒక్క జూబ్లీహిల్స్‌లోనే 3,500 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు సరికదా పేదల ఇళ్లు కూలగొడుతోందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్‌కు డిపాజిట్ పోతేనే ప్రజలకు బాకీలన్నీ వస్తాయి..
కాంగ్రెస్ ప్రభుత్వంపై విసిగిపోయిన 4 కోట్ల మంది ప్రజల గోస తీర్చే అవకాశం 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు వచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి చిత్తుచిత్తుగా ఓడితేనే ప్రజలకు రావాల్సిన బాకీలన్నీ వస్తాయన్నారు. మైనారిటీలను ఆకట్టుకోవడానికే కాంగ్రెస్ పార్టీ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. రెండేళ్లుగా మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని కేబినెట్‌ను కొనసాగించిన రేవంత్‌రెడ్డి.. ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
బీఆర్‌ఎస్ కులమతాల పునాదులపై పనిచేయదని.. కానీ కాంగ్రెస్ ఆ పని చేస్తోందని మండిపడ్డారు. ఆడబిడ్డలు, వృద్ధులు, ఆటోడ్రైవర్లు సహా అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ 420 హామీలిచ్చినా ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. దోచుకున్న సొమ్ముతో ప్రజలకు రూ. 5 వేల చొప్పున ఇచ్చి ఓట్లు కొనేందుకు వస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలిచ్చే డబ్బు తీసుకొని ఆడపడుచులైతే మిగతా రూ. 55 వేలు ఏవని అడగాలని.. మిగతా వారు వారికిచ్చిన హామీలకు అనుగుణంగా మిగతా అప్పు ఎప్పుడు తీరుస్తారని ప్రశ్నించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
నాడు అగ్రస్థానం.. నేడు అట్టడుగుకు..
బీఆర్‌ఎస్ హయాంలో సంపద సృష్టిలో నంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ ప్రస్తుతం రేవంత్ సర్కారు పాలనలో అట్టడుగున 28వ ర్యాంక్‌కు పడిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్‌ను నాశనం చేసిందని.. ఆటోవాళ్ల ఉపాధి దెబ్బతీయడం వల్ల 162 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. నగర ప్రజల్ని, గ్రామీణ రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ రెండేళ్ల పాలనను, పదేళ్ల కేసీఆర్ పాలనను చూసిన ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని కేటీఆర్ కోరారు.


