మీ వేలితోనే మీ కన్ను పొడుచుకోవద్దు
రాష్ట్రంలో కొత్త తుపాను రాబోతోంది
కత్తి మాచేతికివ్వండి.. మీ తరపున యుద్ధం చేస్తామని ప్రజలనుద్దేశించి వ్యాఖ్య
ఎర్రగడ్డ రోడ్‌షోలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఒక్కసారి అవకాశమిస్తేనే నాశనం చేసిన., మళ్లీ అవకాశమిస్తే సర్వనాశనం చేస్తా’అంటున్న రేవంత్‌రెడ్డికి అవకాశమిస్తే మీ వేలితోనే మీ కన్ను పొడుచుకున్నట్లవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్‌లో మాట్లాడుతూ మీ ఓటుతో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 14న మీ సత్తా చూపాలని, బీఆర్‌ఎస్ గెలుపుతో రాష్ట్రంలో కొత్త తుపాను రానుందని వ్యాఖ్యానించారు. గెలుపు అనే కత్తిని మాచేతికిస్తే మీ తరపున యుద్ధం చేస్తామన్నారు. ‘పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు అందరినీ మోసం చేసిన కాంగ్రెస్‌కా.. లేక పేదల బతుకులు ఆగం చేస్తే గల్లాపట్టి గుంజికొడతాం అంటున్న బీఆర్‌ఎస్‌కా మీ ఓటు’ అని ప్రశ్నించారు.
సర్వేల్లో ఓటమి అని తేలగానే అజహరుద్దీన్‌కు మంత్రి పదవి, సినీ కార్మికులకు వరాలు కురిపించడమే కాక ముఖ్యమంత్రితో సహ మంత్రులందరూ గల్లీగల్లీ తిరుగుతున్నారని, ఈ ఎన్నికల్లో వారిని ఓడిస్తేనే మీకిచ్చిన హామీలన్నీ అమలవుతాయని అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి జరిగాయన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే తులం బంగారం ఇవ్వకపోగా మెడలో పుస్తెలు లాక్కుంటారని కేసీఆర్ అప్పుడే చెప్పారన్నారు.
పార్టీ అభ్యర్థి మాగుంట సునీత మీద కుట్రలు చేస్తున్నారని, ఆమెకు అండగా నిలబడాలన్నారు. ప్రజలను బెదిరిస్తూ నకరాలు చేస్తున్న గూండాల పేర్లు రాసిపెట్టుకుంటామన్నారు. 500 రోజుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న వారి తోకలు కత్తిరిస్తామన్నారు. ఈ రెండు మూడు రోజుల్లో తోకలాడించే పోలీసులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్ షోలో పార్టీ నేతలు పల్లా రాజేశ్వరరెడ్డి, విష్ణు పాల్గొనగా, పెద్దసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.


