కరీంనగర్ కలెక్టర్ తీరును తప్పుబట్టిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి సర్వే నంబర్ 197, 198లోని భూములకు సంబంధించి సేల్‌డీడ్‌లున్న పిటిషనర్లకు నోటీసులు జారీ చేయకుండా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా కలెక్టర్ చేపట్టిన చర్యలు చెల్లవని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ ఏడాది మేలో 453 సేల్‌డీడ్‌లు రద్దు చేస్తూ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. తెలంగాణ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయనే కారణంతో కలెక్టర్ తీసుకున్న చర్య చట్టవిరుద్ధమని స్పష్టంచేసింది. ఏకపక్షంగా సేల్‌డీడ్‌ల రద్దు సరికాదంటూ.. ఈ మేరకు దాఖలైన 35 రిట్ పిటిషన్లను అనుమతిస్తూ తీర్పునిచ్చింది.
ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ లోకాయుక్తాకు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ నియమాలు–2016లోని రూల్ 243 కింద కలెక్టర్ సేల్‌డీడ్‌లు రద్దు చేశారు. కలెక్టర్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హనుమాజీపల్లికి చెందిన లింగాల పద్మ సహా మరికొందరు హైకోర్టులో 35 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సీలింగ్ వివాదానికి సంబంధించి వాదనలు విని తాజాగా తీర్పు వెలువరించింది.
వివాదాస్పద సర్వే నంబర్ రేకుర్తి గ్రామానికి సంబంధించిందని, కొత్తపల్లివి కావని స్పష్టంచేసింది. పిటిషనర్లకు షోకాజ్ నోటీసులైనా జారీ చేయకుండా, వారి వాదనలు వినకుండా రద్దు చేయడం సరికాదంది. అసలు ఆ భూములు నిషేధిత జాబితాలో ఎప్పుడు, ఎలా చేర్చారనే దానిపై అధికారులకు కూడా స్పష్టత లేదని వ్యాఖ్యానించింది. స్పష్టమైన ప్రకటన లేదా గెజిట్ నోటిఫికేషన్ లేనందున, ఆ భూములను సెక్షన్ 22ఏ పరిధిలోకి తీసుకురాలేరని చెబుతూ కలెక్టర్ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ ఉత్తర్వు కాపీని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.


