భర్త కుటుంబ సభ్యులతో భార్య బంధువుల ఘర్షణ
ముగ్గురికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
నాగర్‌కర్నూల్ జిల్లా: పెళ్లయిన తర్వాత కూడా ప్రియురాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో భార్య తరఫు బంధువులు భర్త కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఘటన బుధవారం జరిగింది. కల్వకుర్తి సీఐ నాగార్జున, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కల్వకుర్తి మున్సిపాలిటీలోని సంజాపూర్ వార్డుకు చెందిన మల్లేష్‌కు వెల్దండ మండలం చెర్కూర్‌కు చెందిన శిరీషతో రెండేళ్ల క్రితం పెద్దలు వివాహం చేశారు.
అయితే అంతకు ముందే మున్సిపాలిటీలోని సిలార్‌పల్లి వార్డుకు చెందిన ఓ యువతితో మల్లేష్‌కు మధ్య ప్రేమాయణం నడిచింది. అనంతరం శిరీషకు కుమారుడు పుట్టినా మల్లేష్ ప్రియురాలి దగ్గరికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే మూడు నెలల కిందట ప్రియురాలితో మల్లేష్ ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోగా.. భార్య తరఫు బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వారిని పట్టుకొని వచ్చి పెద్దల సమక్షంలో నచ్చజెప్పారు. అయినా మరోమారు ఇటీవల ప్రియురాలితో మల్లేష్ వెళ్లిపోయాడు. అనంతరం పంచాయితీ పెట్టగా మల్లేష్ ప్రియురాలితోనే ఉంటానని తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో భర్త కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూమిని శిరీష పేరిట లేదా గార్డియన్‌గా ఉంటూ నాయనమ్మ అలివేలుతో శిరీష కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయాలని మల్లేష్ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు.
మల్లేష్ రాకతో దాడి
కొన్ని రోజులుగా ప్రియురాలితో ఉంటున్న మల్లేష్ స్వగ్రామం వచ్చాడన్న సమాచారం తెలుసుకున్న భార్య తరఫు బంధువులు అతనితో మాట్లాడదామని గ్రామానికి వచ్చారు. పొలం వద్ద పనులు చేసుకుంటున్న మల్లేష్ తండ్రి జంగయ్య, తల్లి అలివేలు, తమ్ముడు పరమేష్‌ను భార్య తరఫు బంధువులు శివ, ప్రశాంత్, రామకృష్ణ, వెంకటేష్, సుభాష్, నరేష్ ఘర్షణ పడి.. వేటకొడవళ్లతో వారిపై దాడి చేశారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని స్థానికులు కల్వకుర్తిలోని సీహెచ్‌సీకి, తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. సంఘటనా స్థలాన్ని కల్వకుర్తి సీఐ నాగార్జున పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మల్లేష్ తమ్ముడు పరమేష్ పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడిన వారి వివరాలు పోలీసులు గోప్యంగా ఉంచారు.


