జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార బరిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ బలగాలు
ముందుండి నడిపిస్తున్న ఆయా పార్టీల అగ్రనేతలు
మంత్రివర్గం మొత్తాన్ని మోహరించిన కాంగ్రెస్
ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్
బీజేపీకి అంతా తానై నడిపిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
బీఆర్‌ఎస్ ప్రచారాన్ని భుజాన వేసుకున్న కేటీఆర్
రేపటితో ముగియనున్న ప్రచారం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వంలో ప్రధాన రాజకీయ పక్షాలు తమ పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో మోహరించడంతో నియోజకవర్గం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు వివిధ పార్టీల తరఫున ప్రచార యుద్ధాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఉప ఎన్నిక ఫలితాన్ని జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి. ప్రచార పర్వం క్లైమాక్స్‌కు చేరటంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో ప్రచార పోరు చివరి నిమిషం వరకు కొనసాగించేలా షెడ్యూల్‌ను సిద్ధం చేసుకున్నాయి.
‘హస్త’గతానికి సీఎం రేవంత్ పావులు
తమ రెండేళ్ల పాలనను చూపుతూ బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా కాంగ్రెస్ ప్రచారాన్ని భుజాన వేసుకొని క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రెండేళ్ల పాలనలో అమలు చేసిన మహాలక్షి్మ, గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, సన్న బియ్యం వంటి పథకాలను బలంగా ప్రచారం చేస్తోంది. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య దోస్తీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఫోర్త్ సిటీ వంటి అంశాలను కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు.
ప్రతి ఓటర్‌ను చేరుకునేలా 14 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు గడపగడపకూ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల, వాకిటి శ్రీహరి, శ్రీధర్‌బాబు, లక్ష్మణ్, కొండా సురేఖ, దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌కు డివిజన్లవారీగా ప్రచారం, సమన్వయ బాధ్యతలు అప్పగించారు. సోషల్ ఇంజనీరింగ్ పేరిట యాదవులు, ఎస్సీలు, ముస్లిం, రెడ్డి, కమ్మ సామాజికవర్గం ఓటర్లపై కాంగ్రెస్ ఫోకస్ చేసినట్లు ప్రచార శైలిని బట్టి తెలుస్తోంది. కమ్యూనిస్టు, ఎంఐఎం, తెలంగాణ జన సమితి పార్టీలు కూడా కాంగ్రెస్ అభ్యరి్థకి మద్దతుగా ప్రచారం చేస్తున్నాయి.
కమల వికాసానికి కిషన్‌రెడ్డి వ్యూహాలు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండటంతో ఉప ఎన్నిక ప్రచారాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో మాగంటి గోపీనాథ్‌పై పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమైన లంకల దీపక్‌రెడ్డినే ఈసారి కూడా బరిలో నిలిపింది. ఏపీలో ప్రభుత్వ భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన కూడా బీజేపీకి మద్దతు పలుకుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని విస్తృతంగా పర్యటిస్తున్నారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్.రాంచందర్‌రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. ర్యాలీలు, పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, మారి్నంగ్ వాక్‌ల రూపంలో ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రులు బండి సంజయ్, శ్రీనివాసవర్మ, గజేంద్ర షెకావత్, ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఉప నేత పాయల్ శంకర్‌తోపాటు ఏపీ మంత్రి సత్యకుమార్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
కారు స్టీరింగ్‌ను తిప్పుతున్న కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించిన బీఆర్‌ఎస్.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత అభ్యరి్థత్వాన్ని ఇతర పా
ర్టీల కంటే ముందే ఖరారు చేసింది. నియోజకవర్గం పరిధిలోని డివిజన్లకు ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను ఇన్‌చార్జీలుగా ప్రకటించి మూడు నెలల ముందే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచే పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీతో వార్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్య నేతలను ప్రధాన ప్రచారకర్తలుగా ప్రకటించారు.
నియోజకవర్గాన్ని 61 క్లస్టర్లుగా, 200కు పైగా బ్లాకులుగా విభజించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు ఆ స్థాయి నేతలు 60 మందికి ప్రచార సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అన్ని రకాల ప్రచార పద్ధతులను బీఆర్‌ఎస్ ఆచరణలో పెడుతూ ప్రతి ఓటర్‌ను చేరుకునే ప్రయత్నం చేస్తోంది. రేవంత్ ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీల అమల్లో వైఫల్యాలు, బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి, హైడ్రా కూల్చివేతలను ప్రచార అ్రస్తాలుగా సంధిస్తోంది. కేటీఆర్ బీఆర్‌ఎస్ ప్రచారానికి సారథ్యం వహిస్తూ రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చివరి రోజున కేటీఆర్, హరీశ్‌రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చుట్టి వచ్చేలా వేర్వేరుగా బైక్ ర్యాలీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 11వ తేదీన జూబ్లీహిల్స్ ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. 14న ఫలితాలు ప్రకటించనున్నారు.


