నిశ్చితార్ధం ఫంక్షన్‌కోసం రెండువిమానాలు..
గ్రామస్తులు, బంధువులను గోవాకు తీసుకెళ్లిన నాగర్‌కర్నూల్ వ్యక్తి
నాగర్‌కర్నూల్: పూలుపండ్ల ఫంక్షన్ (నిశ్చితార్థం) కోసం సాధారణంగా ప్రైవేట్ బస్సులు బుక్ చేసి కార్యక్రమానికి తీసుకెళ్లడం తెలిసిందే. అయితే తండ్రి కోరిక మేరకు ఓ వ్యక్తి రెండు విమానాల్లో 500 మంది గ్రామస్తులను, బంధువులను తీసుకెళ్లడం విమానాశ్రయ ఉద్యోగులను, ఇతర ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాలు.. నాగర్‌కర్నూల్‌కు చెందిన మేకల అయ్యప్ప కుమారుడు మేకల జగపతి (జవహర్‌నగర్ మాజీ మేయర్ కావ్యకు సోదరుడు) గోవాలో ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులు, బంధువులతోపాటు గ్రామస్తులను సైతం ఫ్లైట్లో గోవా తీసుకెళ్లాలని వాళ్ల తండ్రి నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను అమల్లో పెట్టి వారిని తీసుకెళ్లిన తీరుతో ఎయిర్‌పోర్టులో సందడిగా మారింది. శనివారం రెండు విమానాల్లో కేవలం మేకల వారి బంధువులు, స్నేహితులు మాత్రమే ఉండటంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది, ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. తన తండ్రి కోరిక మేరకు వచ్చిన బంధువులు, స్నేహితులు, గ్రామస్తులకు ఈ సందర్భంగా మేకల కావ్య కృతజ్ఞతలు చెప్పారు.


