అందుకే ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అట్టడుగున ఉంది
పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రాభివృద్ధితో గ్రామీణ, నగరవాసుల మన్నన పొందాం
షేక్‌పేట్ డివిజన్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ప్రచారంలో కేటీఆర్
గోల్కొండ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో అభివృద్ధి శూన్యమని.. అందుకే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అట్టడుగున నిలిచిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆదివారం ఆయన షేక్‌పేట్ డివిజన్‌లోని ఆదిత్య ఇంప్రెస్ గేటెడ్ కమ్యూనిటీలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్‌రెడ్డి పాలనను ఎండగట్టారు.
జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లకు చెక్ పెట్టాం..
పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాభివృద్ధితో గ్రామీణ ప్రజలతోపాటు హైదరాబాద్‌వాసుల మన్ననలు పొందారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు అపార్ట్‌మెంట్లలో జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు లెక్కకు మించి ఉండేవని.. తమ పాలనలో అవన్నీ మాయమయ్యాయన్నారు.
కేసీఆర్ కరెంటు కోతలకు చెక్ పెట్టడమే కాకుండా కృష్ణా, గోదావరి నీటిని నగర ప్రజలకు అందించారని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో ఐటీ ఉద్యోగాల కోసం వేలాది మంది హైదరాబాద్ వచ్చారన్నారు. కోవిడ్ సమయంలోనూ ఒక్క హైదరాబాద్‌లోనే 42 ఫ్లైఓవర్లు నిర్మించినట్లు చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో నత్తనడకన అభివృద్ధి
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అభివృద్ధి నత్తనడకన సాగుతోందని కేటీఆర్ విమర్శించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజారవాణా అభివృద్ది చెందలేదన్నారు. ఆరు గ్యారంటీలంటూ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని ఒక్క సీట్లోనూ గెలవలేకపోయిన కాంగ్రెస్ పార్టీ.. పరువు కాపాడుకోవడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచేందుకు అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇందుకోసం ఎంఐఎంకు బానిసగా మా రి ఆ పార్టీ షరతులన్నింటినీ ఒప్పుకుందని దుయ్యబట్టారు.
నగరవాసులు ఓటేయకుంటే రిగ్గింగ్‌కు అవకాశం
నగరవాసుల ఓటింగ్ సరళిలోనూ మార్పు రావాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. విద్యావంతులు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోందన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకపోతే రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రసంగాల కోసం.. సైన్యాన్ని అవమానిస్తారా..?
సీఎం రేవంత్‌పై ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారతీయ సైన్యంపై చేసిన అవమానకర, దిగజారుడు వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘యూనిఫాం ధరించిన వీరులు సరిహద్దుల్లో అత్యంత క్రూరమైన పరిస్థితుల్లో కష్టపడుతుంటేనే మనం సురక్షితంగా జీవించగలుగుతున్నాం.
ఎన్నికల ప్రసంగం కోసం భారతీయ సైన్యాన్ని తక్కువ చేసి పాకిస్తాన్‌ను పొగడటం ఏమిటి.. భారతీయ సైన్యానికి క్షమాపణ చెప్పి మీ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నోట్ల కట్టలతో పట్టుబడిన వ్యక్తి గూండాలను, రౌడీ షీటర్లను ఆరాధించడం సహజమే. కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా కొంచెం మర్యాదగా ప్రవర్తించండి. తెలంగాణ ప్రతినిధిగా మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించి, సైనికులను గౌరవించాలి’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.


