
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 1 నుంచి యథావిధిగా ప్రజా పంపిణీ కేంద్రాల (రేషన్ దుకాణాలు) ద్వారా సన్న బియ్యం సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూన్ నెలలో ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం పంపిణీ చేసిన నేపథ్యంలో జూలై, ఆగస్టు నెలల్లో రేషన్ దుకాణాలు మూసివేశారు.
సెప్టెంబర్ నుంచి తిరిగి నెలవారీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ నెల కోటా సన్న బియ్యాన్ని రాష్ట్ర స్థాయి గోదాముల (స్టేజ్–1) నుంచి మండల్ లెవల్ స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్లకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లను పౌరసరఫరాల సంస్థ పర్యవేక్షిస్తోంది.
సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్తగా రేషన్‌కార్డులు పొందిన వారందరికీ సెప్టెంబర్ నెలలో సన్నబియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈసారి లబ్ధిదారులకు బియ్యంతో పాటు చేతి సంచిని (బ్యాగ్) అందజేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది.