
సూర్యాపేట జిల్లా: జిల్లాలోని తుంగతుర్తిలో కొందరు ఆర్‌ఎంపీలు మాఫియాగా మారి యధేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారు. తాజాగాఆర్‌ఎంపీ శ్రీనివాస్ అక్రమాలు వెలుగుచూశాయి. ఓ మహిళకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడబిడ్డ అని తేలడంతో అబార్షన్ చేశాడు. అయితే అబార్షన్ వికటించి ఐదు నెలల గర్భిణి విజేత మృతి చెందింది. గత కొంతకాలంగా వైద్యం ముసుగులోఆర్‌ఎంపీ శ్రీనివాస్ లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారు.
బాలాజీ ఆస్పత్రి పేరుతో ఓ కేంద్రం ఏర్పాటు చేసి, కొందరు ఆర్‌ఎంపీలు కలిసి ఓ మాఫియాలాగా మారారు శ్రీనివాస్. తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో పేద గర్భిణీలే టార్గెట్‌గా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. లింగ నిర్ధారణ చేస్తూ ఆడబిడ్డ అని తెలిస్తే కడుపులోనే బిడ్డను చిదిమేస్తున్నారు.
వైద్యం ముసుగులో శ్రీనివాస్ ముఠా చేస్తున్న భ్రూణ హత్యలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుకు సమాచారం ఇచ్చినా కనీసం చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వైద్య తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లామని అంటున్నారు స్థానికులు. శ్రీనివాస్ ముఠా చేస్తోన్న అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చిన వారిపై రాజకీయ పలుకుబడి ఉపయోగించి బెదిరింపులకు సైతం దిగారని ఆరోపిస్తున్నారు.