
‘కాళేశ్వరం’పిల్లర్లు కూలినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు
అప్పుడు బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఏం చేశారు
ప్రవీణ్‌కుమార్‌కు అద్దంకి దయాకర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చేసేందుకు ఎవరో ప్రయత్నాలు చేశారని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇప్పుడు మాట్లాడటం దొంగలు పడ్డ రెండేళ్లకు కుక్కలు మొరిగినట్టుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. నాసిరకం పనులు చేసి, కుంగిపోయేట్టు ప్రాజెక్టులు నిర్మించి, అనువుగాని చోట కట్టి అభాసుపాలయింది కాక, ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఆ పార్టీ మరింత దిగజారుతోందని ఎద్దేవా చేశారు.
శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన తర్వాత రెండున్నర నెలలు బీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలో ఉందని, అప్పుడు ఆ పార్టీ ముఖ్య నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. ఘటన జరిగినప్పుడు కాంగ్రెస్, బీజేపీ, జేఏసీ నేతలతో సహా ఎవరినీ అక్కడకు వెళ్లనీయలేదని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో లుకలుకలతో అధికారం పోవాలని అసలు ఆ ప్రాజెక్టును కూల్చింది కేసీఆరో, కేటీఆరో, కవితనో, హరీశ్‌రావో మీరే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు.
తమ విలాసవంతమైన జీవితం ఎక్కడ బయటపడుతోందోనని అధికారం పోయిన తర్వాత ప్రగతిభవన్ నుంచి విలువైన వస్తువులన్నింటినీ కేసీఆర్ కుటుంబం తీసుకెళ్లిపోయిందని ఆరోపించారు. బంగారం, వెండి, విలువైన ఫర్నిచర్‌ను రెండు లారీల్లో సర్దుకువెళ్లారని, కేవలం ఖాళీ కుర్చీలు, గోడలు మాత్రమే మిగిల్చి వెళ్లారని అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు.