
నాకు ఇటీవల హెపటైటిస్–బీ వచ్చిందని తెలిసింది. ఇప్పుడు నేను ఎనిమిది నెలల గర్భవతిని. మా కుటుంబంలో కొంతమందికి కూడా ఇదే వ్యాధి ఉంది. ఈ విషయం డాక్టర్‌కు ముందుగా చెప్పాలా? నా బిడ్డకు కూడా ఈ వ్యాధి వస్తుందా?
– జ్యోతి, హైదరాబాద్
గర్భవతిగా ఉన్న మీరు ఈ హెపటైటిస్–బీ వంటి వ్యాధి గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ఒక వైరస్ వలన కలిగే వ్యాధి. ఇది రక్తం ద్వారా వ్యాపించి, మీ లివర్‌ను ప్రభావితం చేస్తుంది. గర్భధారణ సమయంలో తల్లి శరీరంలో వైరస్ ఉంటే, బిడ్డ పుట్టే సమయంలో తల్లి రక్తంతో సంపర్కంలోకి వచ్చేటప్పుడు వైరస్ బిడ్డకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన విషయం.
శిశువులకు వైరస్ సోకినప్పుడు దాదాపు తొంభై శాతం శాశ్వత లివర్ వ్యాధిగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించాలంటే మీరు ఇప్పుడే మీ వైద్యులకు చెప్పాలి. ముందుగా సమాచారం ఉంటే తగిన చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. బిడ్డ పుట్టిన వెంటనే ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించేందుకు ప్రత్యేకమైన రక్షణ చికిత్సలు ఉన్నాయి. బిడ్డ పుట్టిన నాటికి రెండు పనులు చేయాలి. ఒక్కటి ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి.
ఇది వైరస్‌ను వెంటనే అడ్డుకుంటుంది. రెండు, హెపటైటిస్–బీ టీకా మొదటి మోతాదును ఇవ్వాలి. ఈ రెండు కూడా బిడ్డ పుట్టిన ఇరవై నాలుగు గంటల లోపల చేయాలి. తర్వాత పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరు మోతాదుల టీకా షెడ్యూలును పూర్తి చేయాలి. మొదటి మోతాదు పుట్టిన వెంటనే, రెండవ మోతాదు నాలుగు వారాల్లో, మూడవది ఎనిమిది వారాల్లో, నాల్గవది పన్నెండు వారాల్లో, ఐదవది పదహారు వారాల్లో, ఆరవది ఇరవై నెలల్లో వేయాలి. ఆరు మోతాదులు పూర్తయిన తర్వాత బిడ్డకు రక్తపరీక్ష చేయాలి. అప్పుడే శరీరంలో రోగనిరోధక శక్తి ఏర్పడిందో లేదో తెలుస్తుంది. తల్లి ఈ సంగతిని వైద్యులకు ముందుగానే చెప్పడం వల్లే సాధ్యమవుతుంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డను సంపూర్ణంగా రక్షించవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా తగిన సమాచారం డాక్టర్‌కి ఇవ్వండి.
నేను గర్భధారణకు ప్లాన్ చేస్తున్నాను. కొంతమంది రుబెల్లా వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని చెబుతున్నారు. కాని, ఇదివరకు నాకు ఈ వ్యాధి వచ్చిందో లేదో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో స్పష్టంగా చెప్పండి.
– అనిత, రాజమండ్రి
మీరు గర్భధారణ కోసం సిద్ధమవుతుంటే, రుబెల్లా వ్యాధి గురించి ముందుగానే తెలుసుకోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రుబెల్లా అనేది ఒక వైరస్ వలన వచ్చే వ్యాధి. ఇది దగ్గుతో, తుమ్ముతో గాలిలోకి వచ్చే జలకణాల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. సాధారణంగా ఇది తేలికపాటి జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో కనిపిస్తుంది. కాని, గర్భధారణ సమయంలో ఈ వైరస్ సోకితే, బిడ్డకు తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు కలగవచ్చు.
ఈ వ్యాధి గర్భంలో ఉన్న శిశువుకు సోకితే, చెవిటితనం, కాటరాక్ట్ వంటి కంటి లోపాలు, గుండెకు సంబంధించిన లోపాలు, మెదడు ఎదుగుదలపై ప్రభావం, లేదా గర్భస్రావం కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ తొలి మూడు నెలల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నివారించడానికి ముందుగా ఒక రక్త పరీక్ష చేయించుకోవాలి. రుబెల్లా ఐజీజీ అనే పరీక్ష చేసి, మీ శరీరంలో ఇప్పటికే ఈ వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉన్నాయా లేదా తెలుసుకుంటారు.
యాంటీబాడీలు ఉన్నట్లయితే, మీ శరీరానికి రక్షణ ఉంది కాబట్టి టీకా అవసరం ఉండదు. యాంటీబాడీలు లేనట్లయితే, తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్ ఎమ్‌ఎమ్‌ఆర్ (మీజిల్స్, మంప్స్, రుబెల్లా) రూపంలో ఇవ్వబడుతుంది. ఒక మోతాదుతో ప్రారంభించి, అవసరమైతే రెండో మోతాదును కొన్ని వారాల గ్యాప్‌లో వేయొచ్చు. అయితే, వ్యాక్సిన్ వేసిన తరువాత కనీసం రెండు నెలల పాటు గర్భం ధరించకూడదు. ఎందుకంటే ఈ సమయంలో శరీరం రక్షణ ఏర్పరచుకుంటుంది. ఇది శిశువును రక్షించడంలో కీలకంగా పనిచేస్తుంది.
టీకా వల్ల కొన్నిసార్లు తేలికపాటి జ్వరం రావచ్చు. మీరు ఎప్పుడైనా ఈ వ్యాక్సిన్ వేసుకున్నారా అనే విషయం స్పష్టంగా గుర్తులేనట్లయితే, పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. టీకా అవసరమైతే ఇప్పుడే వేయించుకుని, రెండు నెలలు గడిచిన తరువాత గర్భధారణకు ప్లాన్ చేసుకోండి. ఇలా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గర్భంలో ఉన్న శిశువు ఎలాంటి హానికి గురికాకుండా, ఆరోగ్యంగా జన్మించే అవకాశం ఉంటుంది.
డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: Independence Day 2025: మోదీ ప్రసంగంలో ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు..! హాట్‌టాపిక్‌గా ఊబకాయం..)