
ఒకవైపు మెయిన్‌స్ట్రీమ్ టీవీ షోలు, మరోవైపు ‘మహారాజ్’ ‘లాపతా లేడీస్’లాంటి భిన్నమైన బాలీవుడ్ చిత్రాలతో చిన్న వయసులోనే రచయిత్రిగా పెద్ద పేరు తెచ్చుకుంది స్నేహా దేశాయ్. గుజరాత్ నాటకరంగం నుంచి టీవీరంగంలోకి అడుగు పెట్టిన స్నేహ అప్పుడప్పుడు టీవీ షోలలో నటించినప్పటికీ రచనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది.
ఎంతోమంది సీనియర్ రచయితల దగ్గర సహాయకురాలిగా పనిచేసింది. ‘మిసెస్ తెందూల్కర్’తో టీవీ రైటర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తరువాత రాసిన ‘ఆర్‌కే లక్ష్మణ్ కే దునియా’ ‘బిహా హమారీ బహు కా’లాంటి టీవీ షోలతో రైటర్‌గా పేరు తెచ్చుకుంది. ‘టీవీ అంటే అప్పుడే కాదు నాకు ఎప్పటికీ ఇష్టమే’ అని చెప్పే స్నేహ టీవీ కోసం ప్రతి నెల 56 ఎపిసోడ్‌లు రాసేది. గుజరాతీ ప్రాంతీయ టీవీకి రాస్తున్న స్నేహకు ‘మహారాజ్’ సినిమా అవకాశం వచ్చింది. దీనికి కారణం ‘మహారాజ్’ అనేది గుజరాతీ నేపథ్యం ఉన్న కథ. ఈ సినిమాకు స్నేహ రాసిన స్క్రీన్‌ప్లే ఆమిర్‌ఖాన్‌కు బాగా నచ్చింది.
దీంతో ‘లా పతా లేడీస్’కు పనిచేసే అవకాశం వచ్చింది. బిప్లబ్ గోస్వామి రాసిన కథకు స్క్రీన్‌ప్లే రాయల్సిందిగా ఆమిర్‌ఖాన్ నుంచి పిలువు వచ్చింది. ఈ సినిమాకు కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. ‘మహిళలు రాసేవి పురుషులు కూడా రాస్తారు. అయితే ఇద్దరి దృష్టి కోణం వేరుగా ఉంటుంది. మహిళగా నా అనుభవాలు, ఆలోచనలు పురుషులతో భిన్నంగా ఉండడం అనేది సహజం. లాపతా లేడీస్‌లో ఎన్నో స్త్రీ పాత్రలు ఉంటాయి. ఒక మహిళగా ఆ పాత్రలను అర్థం చేసుకొని రాయడం నాకు సులువు అయింది’ అంటోంది స్నేహ దేశాయ్.