యాత్ర సైకిల్‌పై కశ్మీర్‌ టు కన్యాకుమారి | Journey from Kashmir to Kanyakumari by bicycle | Sakshi
Sakshi News home page

యాత్ర సైకిల్‌పై కశ్మీర్‌ టు కన్యాకుమారి

Nov 26 2025 1:05 AM | Updated on Nov 26 2025 1:05 AM

Journey from Kashmir to Kanyakumari by bicycle

సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ 150వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘సైకిల్‌ రైడ్‌’ కార్యక్రమం నిర్వహించగా, దేశవ్యాప్తంగా మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలోనుంచి నూట యాభైమందిని ఎంపిక చేశారు. ఆ ఎంపికైన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన తిరుపతిరెడ్డి, వంశీకృష్ణ, గాంధీ, రామారావు, శశికళ, ప్రత్యోత్‌ అగర్వాల్, నాగరాజు, గోపి ఉన్నారు. పదహారు రోజులలో పది రాష్ట్రాలలో ప్రయాణం చేసి లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రతిరోజు 250 కిలోమీటర్లు సైక్లింగ్‌ చేసేవారు. ఎవరి సైకిల్‌ వారే వెంట తెచ్చుకోగా, భోజన వసతులను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. సైకిల్‌ మెకానిక్‌తోపాటు, మూడు వాహనాల కాన్వాయ్‌ ఉండేది.

వారు ప్రోఫెషనల్‌ సైకిలిస్ట్‌లు కాదు. ఎలీట్‌ అథ్లెట్స్‌ అంతకంటే కాదు. వారి ఉత్సాహమే వారి అనుభవం అయింది. శక్తిగా మారింది. కేంద్రప్రభుత్వ కార్యక్రమం ‘కశ్మీర్‌ టు కన్యాకుమారి సైకిల్‌ రైడ్‌’కు ఎంపికైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైడర్స్‌ నాలుగు వేల కిలోమీటర్‌ల సైకిల్‌ యాత్ర చేశారు...

కష్టమైనా... ఇష్టంగా...
‘కశ్మీర్‌ టూ కన్యాకుమారి యాత్ర మర్చిపోలేని అనుభూతినిచ్చింది. నవంబర్‌ 1న కశ్మీర్‌లో యాత్ర మొదలుపెట్టాం. పది రాష్ట్రాలు దాటుతూ నవంబర్‌ 16న సైకిల్‌ యాత్ర పూర్తి చేశాం. ఆసియాలో అతికష్టమైన, పెద్దదయిన సైక్లింగ్‌ రూట్‌ ఇది. 2023 నవంబర్‌లో కశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు సైక్లింగ్‌ రైడ్‌ చేయాలని ఏర్పాట్లు చేసుకున్నాను. కానీ యాక్సిడెంట్‌లో గాయపడటంతో చేయలేక΄ోయాను’ అంటున్నాడు గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు వెంకట తిరుపతిరెడ్డి.

అనారోగ్య సమస్యలు వచ్చినా...
‘నాలుగు వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేయడం ఇదే మొదటిసారి. కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా ఆగి΄ోవాలనిపించలేదు. సుదీర్ఘ సైకిల్‌ యాత్ర చేయాలనే నా లక్ష్యం ఇంత తొందరగా నెరవేరుతుందని అనుకోలేదు’ అంటున్నాడు హైదరాబాద్‌లోని బోయినపల్లికి చెందిన వంశీకృష్ణ.

భవిష్యత్‌లో మరిన్ని యాత్రలు
‘గతంలో హెచ్‌సీజీ (హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్‌) తరపున సైకిల్‌ యాత్రలోపాల్గొన్నాను. కశ్మీర్‌ టూ కన్యాకుమారి వెళ్లాం. అన్ని రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించింది. భవిష్యత్‌లో మరిన్ని సైకిల్‌ యాత్రలు చేస్తాను’ అంటున్నాడు హైదరాబాద్‌ నిజాంపేట్‌కు చెందిన జన్ని గాంధీ.

యువతలో స్ఫూర్తి కోసం...
‘చలి ప్రాంతంలో మొదలై ఉష్ణ ప్రాంతానికి వచ్చాం. అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకున్నాం. యువతకు స్ఫూర్తి కల్పించాలనే ఆలోచనతో సైకిల్‌ యాత్రలోపాల్గొన్నాను. సెల్‌ఫోన్‌తో గంటల తరబడి సమయాన్ని వృథా చేసే బదులు ఇలాంటి సైకిల్‌ యాత్రలు చేస్తే మంచిది. సైకిల్‌ రైడింగ్‌ వల్ల కాలుష్యం తగ్గుతుంది’ అంటున్నాడు వరంగల్‌లోని కొత్తవాడకు చెందిన ఎ.రామారావు.

కశ్మీర్‌ అందాలు కళ్లారా...
‘జీవితంలో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చిన సైకిల్‌ యాత్ర ఇది. ఎన్నో రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు పరిశీలిస్తూ ముందుకెళ్లాం. అన్నిటికన్నా కశ్మీర్‌ అందాలు కళ్లారా చూడటం చాలా సంతోషంగా ఉంది’ అంటున్నాడు ములుగు జిల్లాకు చెందిన అంగోతు నాగరాజు.

అనారోగ్య సమస్యలు దూరం అయ్యాయి... 
స్ట్రెస్‌ రిలీఫ్‌ కోసం సైకిల్‌ రైడింగ్‌ చేస్తుండేదాన్ని. రెండు కిలోమీటర్లు, ఏడు కిలోమీటర్లతో సైకిల్‌ రైడింగ్‌ మొదలుపెట్టాను. నాలుగు వేల కిలోమీటర్లుపాల్గొనడం జీవితంలో ఇదే మొదటిసారి. ఇతర సైక్లింగ్‌ రైడర్‌లతో మాట్లాడి అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఈ సైకిల్‌ యాత్ర వలన బరువు తగ్గాను. అనారోగ్య సమస్యలు దూరం అయ్యాయి. – శశికళ ΄÷న్నుస్వామి, గృహిణి, హైదరాబాద్‌

ప్రతిరోజూ సాహసమే..
‘మహారాష్ట్రలో రోడ్లు సరిగా లేవు. జైపూర్, దిల్లీ రోడ్లు బిజీగా ఉంటాయి.ప్రాణాలతో చెలగాటమాడుతూ రైడింగ్‌ ప్రతిరోజు కత్తిమీద సాములాగే నడిచింది. ప్రతిరోజు ఐదుగంటలే నిద్రపోయాం’ అంటున్నాడు ఖమ్మంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రేగళ్ల గోపి. ‘తమిళనాడులో రోడ్లు చాలా బాగున్నాయి. ఉదయ్‌పూర్‌ నుంచి గోద్రా దారి వెంట ప్రకృతి అందాలు మర్చిపోలేని’ అంటున్నాడు హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన ప్రత్యోత్‌ అగర్వాల్‌. – కాల్వ చంద్రశేఖర్‌ రెడ్డి, సాక్షి, గోదావరిఖని 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement