ఢిల్లీలో డిసెంబర్ 6న వరుస పేలుళ్లు జరిపేందుకు కుట్ర!
ఫరీదాబాద్ ఉగ్రమాడ్యూల్ సభ్యుల విచారణతో వెలుగులోకి విస్మయకర విషయాలు
జనవరి నుంచే పలు మార్లు రెక్కీ పూర్తి
ఎర్రకోట పరిసరాలపై పట్టుసాధించిన ముజమిల్ ఘనీ
వాహనాధారిత ఐఈడీతో విధ్వంసానికి పథక రచన
ఆత్మాహుతి బాంబర్ ఉమర్‌కు చెందిన మరో కారు గుర్తింపు
విదేశాల నుంచి నిధులు అందుకున్న ఉగ్రమాడ్యూల్ సభ్యులు
గతంలో తుర్కియేకు వెళ్లొచ్చిన ఘనీ, ఉమర్
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ఉగ్రవాదులు అతికించిన పోస్టర్ చివరకు దేశరాజధానిలో వరుస బాంబు పేలుళ్ల ఉగ్రకుట్ర భగ్నానికి దారితీసింది. పదో తేదీన ఎర్రకోట సమీపంలో నడిరోడ్డుపై కారు పేలి పలువురి బ్రతుకుల్ని ఛిద్రం చేసిన ఉదంతం వెనుక భారీ ఉగ్ర కుట్ర దాగి ఉందని తాజా దర్యాప్తులో తేలింది. బాబ్రీ మసీదును కూల్చేసిన అదే డిసెంబర్ ఆరో తేదీన ఢిల్లీలో వరుస బాంబుపేలుళ్లు జరపాలని వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణలో వెల్లడైంది.
ఫరీదాబాద్‌లో 2,500 కేజీల అమ్మోనియం నైట్రేట్, పొటాíÙయం క్లోరేట్, సల్ఫర్‌ల స్వాధీనం, వాటి నిల్వతో సంబంధం ఉన్న ఉగ్రమాడ్యూల్ సభ్యుల అరెస్ట్ తర్వాత వారిని లోతుగా ప్రశ్నించగా ఈ కుట్ర విషయం బయటపడింది. గణతంత్రదినోత్సవం సందర్భంగా జనవరి 26న ఢిల్లీలో పేలుళ్లు జరగబోతున్నాయని తొలుత వార్తలొచ్చినా అసలు దాడి డిసెంబర్‌లోనే చేయాలని ఉగ్రవాదులు నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. ఇందుకు బలం చేకూర్చే ఆధారాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు సంపాదించారు.
ఫరీదాబాద్‌లో అరెస్టయిన డాక్టర్ ముజామిల్ ఘనీ ఈ ఏడాది జనవరిలోనే పలు మార్లు ఎర్రకోట, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుమార్లు రెక్కీ నిర్వహించాడని అతని మొబైల్ కాల్ డేటా, లొకేషన్ల ద్వారా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. జనవరి 26న దాడులకు ప్లాన్‌చేసినా ఆరోజు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అవకాశం ఉండటంతో దాడుల ప్లాన్‌ను డిసెంబర్ ఆరో తేదీకి మార్చినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. మొబైల్‌లోని డంప్ డేటాను విశ్లేíÙంచడంతో ఈ విషయం స్పష్టమైంది. కారుతోపాటు పేలిపోయిన డాక్టర్ ఉమర్ నబీతో కలిసి ఘనీ 2021లో తుర్కియేకు వెళ్లొచ్చినట్లు వాళ్ల పాస్‌పోర్ట్‌ల మీది స్టాంపింగ్‌ల ఆధారంగా పోలీసులు కనిపెట్టారు.
విదేశీ హ్యాండ్లర్‌ల నుంచి వీళ్లకు ఏ స్థాయిలో ఆర్థిక, ఆయుధ, పేలుడు పదార్థాల సరఫరా సాయం అందిందనే కోణంలోనూ దర్యాప్తు మొదలెట్టారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ సభ్యులతో ఉమర్, ఘనీ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల రెండు టెలిగ్రామ్ గ్రూప్‌లలో ఉమర్, ఘనీలు సభ్యులుగా ఉన్నారు. వీటిలో ఒకదానిని పాకిస్తాన్‌లోని జైషే మొహమ్మద్ ఆపరేటివ్ ఉమర్ బిన్ ఖథాబ్ నిర్వహిస్తున్నాడు. మరో గ్రూప్‌లో కశ్మీర్‌కు చెందిన ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ సభ్యునిగా ఉన్నాడు. 2008లో ముంబైలో మారణహోమం తరహాలో దాడులుచేయాలని ఉమర్, ఘనీలకు ఆదేశాలు అందాయి. దీపావళి రోజున దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో దాడులుచేయాలని
సూచించాడు.
రామ్‌లీలా మైదానం సమీపంలో 3 గంటలు
అత్యంత పేలుడు పదార్థం(ఐఈడీ)ను వాహనానికి అమర్చి వాహనాధారిత ఐఈడీని తయారుచేయడంలో ఉమర్ నిమగ్నమైనట్లు అరెస్టయిన ఉగ్రవాదులు చెప్పారు. వీబీఐఈడీలో డిటోనేషన్ సర్క్యూట్ ఏర్పాటు, తయారీకి సంబంధించిన సాంకేతిక నైపుణ్యం సాధించేందుకు ఉమర్ పూర్తిగా ఇంటర్నెట్‌పై ఆధారపడినట్లుతెలుస్తోంది. అయితే తోటి సహచరులు అందరూ పోలీసులకు చిక్కడంతో తాను దొరికిపోతానన్న తొందరలో పూర్తిస్థాయి ఐఈడీ తయారుచేయకుండానే అమ్మోనియం నైట్రేట్‌తో వాహనాన్ని తీసుకుని తన స్థావరం నుంచి పారిపోయాడని దర్యాప్తు సంస్థలు చెప్పాయి. పేలుడుకు ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడెక్కడ తిరిగాడన్న విషయలు ఒక్కోటిగా బయటికొస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం పదో తేదీన కారు పేలడానికి ముందు ఉమర్ తన కారులో అసఫ్ అలీ రోడ్డులోని మసీదుకు వెళ్లాడు. దీని పక్కనే రామ్‌లీలా మైదానం ఉంది. ఉమర్ అక్కడే మూడు గంటలు ఉన్నాడు. తర్వాత నమాజ్ పూర్తిచేసుకుని ఎర్రకోట వైపు వచ్చాడు.
ఉమర్ పేరిట మరో కారు
చనిపోయిన ఉమర్ పేరిట ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు(డీఎల్10సీకే0458) ఉందని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో దీని జాడ కనిపెట్టేందుకు ఢిల్లీ, హరియాణా పోలీసులు బృందాలు రంగంలోకి దిగి అన్ని చెక్‌పోస్ట్‌ల వద్ద జల్లెడపట్టాయి. చివరకు దానిని ఫరీదాబాద్ జిల్లాలోని ఖాండావాలీ గ్రామంలో పోలీసులు గుర్తించి స్వా«దీనంచేసుకున్నారు. ఫరీదాబాద్‌లో అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయం సమీపంలోని తన అద్దె ఇంట్లో పేలుడుపదార్థాలను దాచిపెట్టేందుకు ఉగ్రవాదులకు సాయపడిన ఇస్లాం మతబోధకుడు, మౌల్వీ ఇష్తియాఖ్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటిదాకా ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. మేవాట్‌కు చెందిన మౌల్వీ తరచూ అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయంలో మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించేవాడు. అలా ఉమర్, ఘనీసహా పలువురు వైద్యులు, విద్యార్థుల మెదళ్లలోకి ఉగ్రభావజాలాన్ని నింపినట్లు తేలింది.
శక్తివంతమైన ఐఈడీల తయారీ!
అత్యంత శక్తివంతమైన 200 ఐఈడీల తయారీలో ఉగ్రమాడ్యూల్ సభ్యులు గతంలోనే మునిగిపోయారని దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియాగేట్, కాన్సిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం, గురుగ్రామ్, ఫరీదాబాద్‌సహా దేశంలోని కీలక ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వేస్టేషన్లు, మాల్స్ వద్ద పేలుళ్లు జరపాలని భారీ ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో అమ్మోనియం నైట్రేట్‌తోపాటు ఒక కొత్తతరహా రసాయనం అశేషాలను పోలీసులు గుర్తించారు. అది అమ్మోనియం నైట్రేట్ కంటే అత్యంత విస్ఫోటక గుణమున్న ధాతువు కావొచ్చని భావిస్తున్నారు. బుధవారం ఘటనాస్థలి నుంచి 40 శాంపిళ్లను ఢిల్లీ ఫోరెన్సిక్ విభాగం సేకరించింది. వీటితోపాటు ఇతర మందుగుండు, బుల్లెట్లను స్వా«దీనంచేసుకున్నారు. పేలుడు తర్వాత పేరు మార్మోగిపోతున్న అల్–ఫలాహ్ వర్సిటీలో పోలీసులు ముమ్మర సోదాలు కొనసాగిస్తున్నారు. ఉమర్, ఘనీలతో సంబంధం ఉన్న వాళ్లను ప్రశి్నస్తున్నారు.
కశ్మీర్‌లో 500 చోట్ల సోదాలు
బుధవారం ఒక్కరోజే కశ్మీర్‌లోని శ్రీనగర్, గందేర్బల్, బుద్గామ్, బారాముల్లా, బందీపొరా, కుప్వారా, అనంత్‌నాగ్, కుల్గాం, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లోని 500 చోట్ల పోలీసులు విస్తృతస్థాయిలో సోదాలుచేశారు. జమాతే ఇస్లామీ ఉగ్రసంస్థ మళ్లీ క్రియాశీలకంగా మారిందన్న సమాచారంతో పోలీసలు ఆకస్మిక తనిఖీలు చేశారు. థానె, పుణెలో మహారాష్ట్ర ఏటీసీ బృందం సోదాలుచేసింది. అల్‌ఖైదాతో సంబంధమున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్ నేపథ్యంలో థానెలో ఒక టీచర్, పుణెలో మరో వ్యక్తికి చెందిన చోట్ల సోదాలు జరిగాయి.


