
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికపై అధికార బీజేపీ దృష్టి పెట్టింది. తమ అభ్యర్థిని సాధ్యమైనంత త్వరగా ఖరారు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం భేటీ కానుంది. సాయంత్రం ఆరు గంటలకు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యతలను ఎన్డీయే అప్పగించింది. పార్టీ అభ్యర్థి పేరుపై ఈ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 4న ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మికంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అభ్యర్థి ఎంపిక పరిశీలనలో పేర్లు ఇవే..
ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పరిశీలనలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత, ఆర్ఎస్ఎస్ నేత శేషాద్రి చారి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఉన్నట్టు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది.
సెప్టెంబర్ 9న కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఆగస్టు 21తో నామినేషన్ల గడువు ముగియనుంది. లోక్‌సభ, రాజ్యసభలో కలిపి మొత్తం 781 మంది సభ్యులు కలిగిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో నెగ్గాలంటే కనీసం 391 ఓట్లు అవసరం. 422 మంది ఎంపీల బలం కలిగిన అధికార ఎన్డీయేకు స్పష్టమైన విజయావకాశాలు ఉన్నాయి. మరోవైపు విపక్ష ‘ఇండియా’ కూటమి సైతం తమ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.