
ముంబై: ఓలా ఎలక్ట్రిక్ తన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా స్పోర్ట్స్ స్కూటర్ విభాగంలోకి అడుగు పెట్టనుంది. తాజాగా స్పోర్టియర్ వెర్షన్‌లో కనిపిస్తున్న ఓ స్కూటర్ టీజర్‌ను బుధవారం విడుదల చేసింది. ఓలా ‘కృత్రిమ్’ ఏఐ ఫీచర్స్‌తో ఈ స్పోర్ట్స్ స్కూటర్లు రానున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.
ప్రతి ఏటా ఆగస్టు 15న నిర్వహించే తన వార్షిక ‘సంకల్ప్’ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయంగా టీవీఎస్ ఎన్‌టార్క్, యమహా ఏరోక్స్ 155, ఏప్రిలియా ఎస్‌ఆర్160 మోడళ్లు స్పోర్ట్స్ స్కూటర్ల విభాగంలో ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఓలా ఎలక్ట్రిక్ డ్యూయల్ ఏబీఎస్, బ్రేక్ బై వైర్ సదుపాయాలతో పాటు సొంతంగా తయారు చేసిన 4680 సెల్ ఫీచర్లతో జెన్ 3 స్కూటర్లను ఆవిష్కరించింది.