
రక్షణ రంగంలో స్వయంసమృద్ధి దిశగా అడుగులు
2024–25లో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.లక్షన్నర కోట్లు
పదేళ్లలో మూడు రెట్లకుపైగా పెరిగిన డిఫెన్స్ ఉత్పత్తులు
2013–14లో రూ.686 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు
దశాబ్దకాలంలో 34 రెట్లు పెరిగి రూ.23,622 కోట్లకు చేరిక
ఇప్పుడు ‘సుదర్శన చక్రం’తో దుర్భేద్యంగా భారతావని
శ్రీకృష్ణుడి ఆయుధమైన సుదర్శన చక్రం స్ఫూర్తితో.. దేశానికి భద్రతా కవచాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ప్రకటించారు. దీంతో ప్రపంచదేశాల దృష్టి ఒక్కసారిగా మనపై పడింది. నిజమే.. రక్షణ రంగంలో ఇప్పుడున్నది ఒకప్పటి భారత్ కాదు. గత పదేళ్లలోనే రక్షణ రంగంలో ఉత్పత్తుల విలువ పెరగడం.. దిగుబడులు తగ్గడమే ఇందుకు నిదర్శనం. అప్పట్లో మన ఆయుధాల్లో 65 శాతం దిగుమతులే. అది ఇప్పుడు 35 శాతానికి పరిమితం చేయగలిగాం. ‘మేడిన్ ఇండియా’ ఆయుధాలతో మన సత్తా ఏంటో ఇటీవలే ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రపంచానికి చాటాం. – సాక్షి, స్పెషల్ డెస్క్
త్వరలో దేశానికి సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థ రానుంది. ఇందులో భాగంగా దేశంలోని కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచాన్ని ఏర్పాటు చేయనున్నారట. అంతేకాదు, ప్రతిదాడి వ్యవస్థను కూడా రూపొందిస్తారు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టం వంటి వాటితో ఇది ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ తరహాలో పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్షణ ఉత్పత్తుల్లో మన దేశం స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోందనడానికి ప్ర‘బల’ నిదర్శనం.
ఉత్పత్తుల్లో రికార్డు
2013–14లో దేశ రక్షణ రంగ బడ్జెట్ రూ.2.53 లక్షల కోట్లు. 2025–26లో అది 2.6 రెట్లు పెరిగి రూ.6.81 లక్షల కోట్లకు చేరింది. 2024–25లో మనదేశం రికార్డు స్థాయిలో రూ.2.09 లక్షల కోట్ల విలువైన 193 డిఫెన్స్ కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఇందులో రూ. 1.69 లక్షల కోట్ల విలువైన 177 కాంట్రాక్టులు దేశీయ సంస్థలవే కావడం గమనార్హం.
2014–15లో దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.46,429 కోట్లు. 2024–25లో ఇది రికార్డు స్థాయిలో రూ.1.50 లక్షల కోట్లకు చేరిందని ఇటీవల కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. అంటే మూడు రెట్లకుపైగా పెరిగింది! 2019–20లో ఇది కేవలం రూ.79,071 కోట్లే. అంటే 5 ఏళ్లలోనే దాదాపు రెట్టింపయిందన్నమాట.
ఎగుమతుల జోరు
» 2013–14లో రూ.686 కోట్లుగా ఉన్న మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు.. 2024–25 నాటికి ఏకంగా 34 రెట్లు పెరిగి రూ.23,622 కోట్లకు చేరాయి. ఈ ఎగుమతుల్లో రక్షణ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల వాటా 77 శాతం కాగా.. ప్రైవేటు రంగ వాటా 23 శాతం కావడం విశేషం. వీలైనంత త్వరలో రక్షణ పరికరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. మనదేశ రక్షణ ఉత్పత్తులు అమెరికా, ఫ్రాన్స్ వంటి 100 దేశాలకు వెళ్తున్నాయి.
అమెరికా వాటా 10% లోపే!
గత దశాబ్దకాలంలో మనదేశ రక్షణ దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. మనకు ప్రధాన ఎగుమతిదారులు రష్యా, ఫ్రాన్స్. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) గణాంకాల ప్రకారం..
» మన మొత్తం దిగుమతుల్లో సుమారు 40 శాతం రష్యా నుంచే వస్తున్నాయి.
» 2020లో ఫ్రాన్స్ నుంచి దిగుమతులు 25 శాతానికిపైగా ఉంటే.. 2021లో ఏకంగా 50 శాతానికి పెరిగాయి. ఆతరవాత తగ్గుతూ 2024లో సుమారు 15 శాతానికి పరిమితమయ్యాయి.
» మొత్తం దిగుమతుల్లో ఇజ్రాయెల్ నుంచి 2022 వరకు 10 శాతంగానే ఉన్న వాటా.. 2023లో ఒక్కసారిగా 40 శాతానికి చేరింది. 2024లో అది సుమారు 28 శాతానికి చేరింది.
» 2020 నుంచి చూస్తే అమెరికా వాటా ఎప్పుడూ 20 శాతం కూడా దాటలేదు. ప్రస్తుతం 10 శాతంలోపే ఉంది.
ఆ మూడు దేశాలే..
మనదేశానికి యుద్ధ విమానాల సరఫరాలో ఫ్రాన్స్ కీలకపాత్ర పోషిస్తోంది. 2020–25 మధ్య రికార్డు స్థాయిలో 2,543 సరఫరా చేయగా, రష్యా నుంచి 1,280 దిగుమతి చేసుకున్నాం. ఇక మిసైళ్ల విషయానికొస్తే రష్యా నుంచి 1,149, ఇజ్రాయెల్ నుంచి 802 వచ్చాయి. శత్రువుల దాడులను తట్టుకోగలిగే దుర్భేద్యమైన రక్షణ వాహనాలు రష్యా నుంచి మాత్రమే 963 వచ్చాయి. గగన తల భద్రతా వ్యవస్థలు రష్యా నుంచి 390, ఇజ్రాయెల్ నుంచి 376 వచ్చాయి. ఫ్రాన్స్ నుంచి 899, రష్యా నుంచి 304 షిప్స్ దిగుమతి చేసుకున్నాం.
ఏయే ఆయుధాల కోసం ప్రధానంగా ఏయే దేశాలపై ఆధారపడుతున్నామంటే..
విమానాలు: ఫ్రాన్స్, రష్యా, అమెరికా
గగనతల రక్షణ వ్యవస్థలు: రష్యా, ఇజ్రాయెల్
దుర్భేద్యమైన రక్షణ వాహనాలు: రష్యా
మిసైళ్లు: రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్
సెన్సర్లు: ఇజ్రాయెల్, జర్మనీ, ఫ్రాన్స్
షిప్స్ : ఫ్రాన్స్, రష్యా