సోనియా నేతృత్వంలో నేడు ఏఐసీసీ పెద్దల సమావేశం
కర్ణాటకలో అధికార మార్పిడి రాజకీయ సంక్షోభంపై చర్చ
సీఎం పదవిపై ఒక నిర్ణయానికి రానున్న అధిష్ఠానం
రేపు ఢిల్లీకి రావాలని సీఎం, డిప్యూటీ సీఎంకు పిలుపు!
ఆదివారంతో సీఎం మార్పు వివాదానికి పూర్తి తెర?
శివకుమార్‌ను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహా్వనించిన సీఎం సిద్ధు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పారీ్టలో నెలకొన్న అధికార పంచాయితీ ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న రగడకు తెరదించేందుకు అధిష్ఠానం సిద్ధమైంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో శనివారం సాయంత్రం 5 గంటలకు అగ్ర నేత సోనియాగాంధీ నేతృత్వంలో హైక మాండ్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోకసభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాం«దీ, పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక వ్యవహారాల ఇంచార్జి రణదీప్‌సింగ్ సుర్జేవాలా పాల్గొననున్నారు. సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పించడం వల్ల జరిగే పరిణామాలు, తలెత్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఆయ నను కొనసాగిస్తే గనుక ఎదురయ్యే సమస్యలు ఏమిటనేది హైకమాండ్ చర్చించనుంది.
ఈ నేపథ్యంలోనే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను ఆదివారం ఢిల్లీ రావాలని అధిష్ఠానం కోరింది. దీంతో కర్ణాటకలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడే సూచనలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయం మేరకు, సిద్ధరామయ్య, శివకుమార్‌లతో మాట్లాడి, ఇద్దరినీ ఒప్పించే ప్రయత్నం చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
విదేశాల నుంచి సోనియా రాకతో...
కర్ణాకటలో ఓవైపు సిద్ధు, డీకే వర్గాలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తుండగా... కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ఓసారి (గురువారం) సమావేశమై రాష్ట్ర నాయకత్వ మార్పుపై సుదీర్ఘంగా చర్చించింది. అయితే, విదేశాల్లో ఉన్న సోనియా అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించింది. కేవలం నాయకుల సలహాలు తీసుకుని భేటీని ముగించారు. ఇక విదేశాల నుంచి తిరిగి వచి్చన సోనియా శనివారం అందుబాటులో ఉండనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కూడా జరగనుంది. ఇందులో సోనియాతో పాటు అధిష్ఠానం పెద్దలు కర్ణాటకపై చర్చించి తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. అందుకే సిద్ధు, డీకేలను ఢిల్లీ రమ్మని కోరినట్లు సమాచారం. వారితో సమాలోచనలు చేసి ఆదివారం సాయంత్రంలోగా సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. తమ నిర్ణయాన్ని వెల్లడించి... ఇద్దరినీ సముదాయించి పారీ్టకి నష్టం కలగకుండా చూసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
నేడు డీకే–సిద్ధు బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్
హైకమాండ్ పిలిస్తే తప్పకుండా ఢిల్లీకి వెళతానని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వారు ఏమి తీర్మానిస్తే దాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తానన్నారు. అధిష్ఠానం సూచనలతో డీకేను శనివారం తన నివాసం కావేరికి బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహా్వనించానన్నారు. ఇద్దరం మాట్లాడుకుని ఢిల్లీకి వెళతామని తెలిపారు. కాగా, నాయకత్వ మార్పుపై సిద్ధు, డీకే కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ధారణకు వచ్చాకనే ఢిల్లీకి రావాలని అధిష్ఠానం పెద్దలు సూచించినట్లు సమాచారం. ఈ మేరకే సిద్ధు బ్రేక్‌ఫాస్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
జోరందుకున్న విందు రాజకీయాలు
అధికార మారి్పడిపై సీఎం, డిప్యూటీ సీఎం వర్గాలు ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఎప్పటికప్పుడు నేతలతో రహస్య చర్చలు, సమావేశాలు నిర్వహిస్తూ తమ వర్గాన్ని బలపరుచుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దీంతో బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. శుక్రవారం మంత్రి కేహెచ్ మునియప్ప నివాసంలో అహింద నాయకుల సమావేశం జరిగింది. ఇందులో ఏఐసీసీ కార్యదర్శి మోహన్ కూడా పాల్గొన్నారు. ఈ అల్పాహార విందులో హైకమాండ్ వద్ద పరపతి ఉన్న ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ కూడా పాల్గొనడం విశేషం. వీరితోపాటు మాజీ మంత్రి ఆంజనేయ, మాజీ ఎంపీ చంద్రప్ప, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణయ్య తదితరులు గంటకుపైగా సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు.
ఏ ఒక్కరి వల్లనో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, అనేక సామాజికవర్గాలు, సంఘాలు, కాంగ్రేసేతర సంస్థలు శ్రమించాయని బీకే హరిప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలను అధిష్ఠానం చాలా సీరియస్‌గా తీసుకుందని, ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఒక మంచి నిర్ణయాన్ని వెల్లడిస్తుందన్నారు. మునియప్ప మాట్లాడుతూ అధికార మార్పిడి వివాదాన్ని హైకమాండ్ వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. అవసరమైతే తాను కూడా వెళ్లి హైకమాండ్‌తో మాట్లాడుతానని వెల్లడించారు.
డీకేకు మద్దతుగా ఒక్కలిగలు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను పట్టనాయకనహళ్లికి చెందిన నంజావధూత స్వామిజీ సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార మారి్పడిపై మాట తప్పితే పరమాత్మ అభినందించడని నంజావధూత పదేపదే మాట్లాడుతూ డీకేకు మద్దతుగా నిలుస్తుండడం గమనార్హం. కాగా, డీకే శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్ ఢిల్లీ చేరుకుని అధిష్ఠానం పెద్దలతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి డీకేను సీఎం చేయాలనే తమ డిమాండ్ వినిపించారు.
సీఎంకు మద్దతుగా కురబలు
డీకే వర్గం ప్రయత్నాలకు ప్రతిగా సిద్ధు వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు గళం వినిపిస్తున్నారు. ఐదేళ్లు సిద్ధునే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు సంతోష్ లాడ్, జమీర్ అహ్మద్‌ఖాన్, హెచ్‌సీ మహదేవప్ప, రామలింగారెడ్డి తదితరులు, పలువురు ఎమ్మెల్యేలు వీరిలో ఉన్నారు. సిద్ధు సొంత సామాజిక వర్గం కురుబ వర్గానికి చెందిన స్వామిజీలు, నేతలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. బలప్రదర్శనకు కూడా కురుబలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఒకే వేదికపై సీఎం, డిప్యూటీ సీఎం.. కానీ, మాటల్లేవ్
ఓవైపు కుర్చీలాట కొనసాగుతున్నా.. సిద్ధు, డీకే శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్నారు. పక్కపక్కనే కూర్చొన్నప్పటికీ ఎవరికి వారు యమునా తీరు చందంగా మాట్లాడుకోలేదు. ఇద్దరు నేతలు చూసీ చూడనట్లుగా ప్రవర్తించడం గమనార్హం. డీకే కుర్చీలో కూర్చొనే సమయంలో సిద్ధు వైపు చూసేందుకు ప్రయత్నించలేదు. ఇదంతా గమనించిన సిద్ధు ఆహ్వాన పత్రం చదువుకుంటూ ఉండిపోయారు.
నమ్మకాన్ని మించిన గుణం లేదు
అన్ని వర్గాలు నాకు మద్దతు ఇస్తున్నాయి నా కులం కాంగ్రెస్ పార్టీ..: డీకే
‘ఇచ్చిన మాట’విషయమై గురువారం సిద్ధు, డీకే మధ్య ట్వీట్ల వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక శుక్రవారం ఓ బహిరంగ సమావేశంలో డీకే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయంగా మారాయి. ‘‘నిమ్మ కంటే పులుపైన వస్తువు ఇంకోటి లేదు. శంభు అంటే పరమేశ్వరుడు. ఆయన కంటే దేవుడు లేడు. నమ్మకం కంటే ఇంకో గుణం లేదు’’అంటూ సర్వజ్ఞ వచనాలను ఉటంకిస్తూ హైకమాండ్‌పై తన నమ్మకాన్ని, విశ్వాసం గురించి పరోక్షంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘‘ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నాకు దేవాలయం. ఢిల్లీలో మాకు ఎన్నో ముఖ్యమైన పనులుంటాయి. అందుకే అక్కడికి వెళ్తుంటాం. నాకు ఎలాంటి సామాజికవర్గాల వ్యాఖ్యానాలు, మద్దతు అవసరం లేదు. నా కులం కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలు నాకు మద్దతుగా ఉన్నాయి. ఏ ఒక్క వర్గానికో నేను పరిమితం కాదు’’అని పేర్కొన్నారు.
28బీఎన్‌జీ70: బెంగళూరు ప్యాలెస్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్


