
హ్యాపీ బాత్‌రూమ్ నుంచే హ్యాపీ డే మొదలవుతుంది. బాత్‌రూమ్‌లో కలిగే చిన్న చిరాకు మీ రోజంతటినీ చెడగొడుతుంది. అందుకే బాత్‌రూమ్ ఇబ్బందులన్నీ క్షణాల్లో తీర్చేసే స్మార్ట్ గ్యాడ్జెట్స్ గురించి ఈ కథనంలో చూసేద్దాం.
బాత్‌రూమ్ సింగింగ్ పార్ట్‌నర్!
స్నానం మొదలైందంటే బకెట్‌లో నీళ్లు మాత్రమే కాదు, కొందరి నోటి నుంచి పాటలు కూడా వెలువడుతూ ఉంటాయి. అలా బాత్‌రూమ్‌లో పాడుతూ గాన స్నానాల్లో ఓలలాడే బాత్‌రూమ్ రాక్‌స్టార్స్‌కు ఇప్పుడు ఓ కొత్త సింగింగ్ పార్ట్‌నర్ వచ్చేసింది. అదే ‘మాక్సీ షవర్‌హెడ్ ’. ఇది కేవలం షవర్ మాత్రమే కాదు, ఇందులో బ్లూటూత్ స్పీకర్ కూడా ఉంటుంది. మొబైల్‌తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తే చాలు.
నీటి శబ్దం మధ్య కూడా మీ పాటలు స్పష్టంగా వినిపిస్తాయి. స్పీకర్‌ను తొలగించడమూ, వాడడమూ చాలా సులభం. యూఎస్‌బీ ద్వారా పూర్తిగా చార్జ్ చేస్తే దాదాపు ఏడుగంటలపాటు పనిచేస్తుంది. ఈ స్పీకర్ శబ్దం నీటి శబ్దాన్ని మించి ఉంటుంది. అందుకే, ఏ అవరోధాలు లేకుండా పాటలు, కథలు, వార్తలు అన్నీ స్పష్టంగా వినవచ్చు. ఫోన్ కాల్ వచ్చినా, స్నానం చేస్తూనే మాట్లాడుకోవచ్చు. ధర సుమారు రూ.10,000. అయితే, కొన్ని చోట్ల తగ్గింపు ధరకూ లభిస్తోంది.
బబుల్ బాత్
పిల్లలకు స్నానం చేయించడమంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాంటిది. ఒకరు పరుగులు పెడితే, మరొకరు వెనకాలే పరుగెడుతూనే ఉండాలి. ‘నో... నో...’ అంటూ పిల్లలు అరుస్తుంటే, ‘ఐదు నిమిషాలే... ఐదు నిమిషాలే’ అంటూ అమ్మనాన్నలు వారిని పట్టుకోవడానికి తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి హడావిడితో నిండిన బాత్ టైమ్‌కు గుడ్‌బై చెప్పే పరిష్కారం వచ్చేసింది! అదే ఈ ‘బాత్ బబుల్ మేకర్’. ఇది నీటి బుడగలను తయారుచేసే పరికరం మాత్రమే కాదు, పిల్లల మొహాల్లో నవ్వులు విరబూయించే సాధనం కూడా!
మ్యూజిక్, బబుల్స్, పిల్లల్ని ఆకట్టుకునేలా ఉండే రంగురంగుల డిజైన్లతో ఉండే వీటిని బాత్‌రూమ్ గోడకు తగిలించేశారంటే చాలు. పిల్లలు స్వయంగా ‘నాకు టబ్ టైమ్ కావాలి!’ అని తెగ కోరుకుంటారు. మార్కెట్లో ఇవి వివిధ ధరల్లో లభిస్తున్నాయి. సంగీతం, లైట్స్‌తో ఉన్న ఆటోమేటిక్ బబుల్ మేకర్లు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు లభిస్తాయి. అధిక బబుల్ ఔట్‌పుట్ ఉన్న హైఎండ్ మోడల్స్‌కు అయితే ధర రూ.5,000 కంటే ఎక్కువే ఉంటుంది.
మాయ అద్దం!
ఉదయం కాఫీ చల్లారినా భరించగలమేమో కాని, షవర్ తర్వాత అద్దంలో ముఖం కనిపించకపోతే మాత్రం వేడెక్కిపోతాం! అప్పుడు చేతిలో టవల్ పట్టుకుని అద్దాన్ని తుడవక తప్పదు. ఇలా ప్రతి ఉదయం చిరాకు తెప్పించే ఈ చిన్న వర్కౌట్‌కి ఇప్పుడు శాశ్వత పరిష్కారం దొరికింది. అదే ఫాగ్‌లెస్ మిర్రర్. దీనిని యాంటీ–ఫాగ్ పూతతో తయారు చేస్తారు.
ఇలాంటి అద్దాలు కొన్నింటిలో హీటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది అద్దాన్ని మెల్లగా వేడి చేసి పొగను తొలగిస్తుంది. మరికొన్నింటిలో ఎల్‌ఈడీ లైట్లు కూడా ఉంటాయి, ఇవి క్లియర్ విజ¯Œ కి తగిన వెలుతురును అందిస్తాయి. దీంతో షేవింగ్, మేకప్ ఏదైనా పని సులభంగా, స్పష్టంగా చేయవచ్చు. ఇవి మార్కెట్‌లో వివిధ డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. గోడకూ అమర్చుకోచ్చు, టేబుల్‌పైన అయినా ఉంచవచ్చు. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. సింపుల్ వెర్షన్లు రూ.799 నుంచి, హీటెడ్ అద్దాలు, లైటింగ్ ఉన్నవి రూ.2,000 వరకు లభిస్తున్నాయి.