
మునుపటి రోజుల్లో ఫొటో అంటే ఒక్క క్లిక్ చాలు. వెంటనే ఆ ఫొటో చేతిలోనే ఉండేది. వేలకొద్దీ బ్లర్‌లు, సెల్ఫీ డిలీట్స్, ఎడిట్స్ ఏమీ ఉండేవి కాదు. ఆ మ్యాజిక్‌ను మళ్లీ మన చేతిలో తేవడానికి వచ్చింది – ఇన్టాక్స్ మినీ ఇవో ప్రీమియం ఎడిషన్! ఇది కేవలం కెమెరా మాత్రమే కాదు, ప్రింటర్ కూడా. ఒక్క క్లిక్‌తో ఫొటో తీయవచ్చు, అదే క్షణంలో ప్రింట్ చేసుకోవచ్చు. పది లెన్స్ ప్రభావాలు, పది ఫిల్మ్ ప్రభావాలు – మొత్తం వంద రకాల మూడ్‌లలో మీ ఫోటోలు తీర్చిదిద్దుకోవచ్చు. రెట్రో లుక్ డిజైన్, డయల్స్‌తో పాత కెమెరా ఫీల్‌కు కొత్త స్పర్శ ఇస్తుంది. అంతేకాదు, డైరెక్ట్ ప్రింట్ ఫీచర్‌తో మొబైల్ నుంచి ఫోటోలు నేరుగా ప్రింట్ చేయవచ్చు. ధర రూ. 19,999.
చిన్ననాటి జాదూ బాక్స్!
చిన్నప్పటి రోజుల్లో స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ మూలన పడేసి, భోజనం కూడా మరచిపోయి గేమ్ కన్సోల్ ఆన్ చేసిన క్షణాలు గుర్తున్నాయా? మారియోలో ప్రిన్సెస్ కోసం పరిగెత్తిన ఆ ఉత్సాహం, కాంట్రాలో లైఫ్ పోయినప్పుడు మనసులో పడిన ఆ బాధ– ఇవన్నీ మళ్లీ నిజం కానున్నాయి. ‘బెలోక్సీ ఎ5 హ్యాండ్‌హెల్డ్ గేమ్ కన్సోల్’ అంటే కేవలం ఒక గాడ్జెట్ కాదు, అది 90ల నాటి బాల్యపు మజాను తిరిగి మన చేతిలో పెట్టే జాదూ బాక్స్. ఇందులో ఏకంగా 500 క్లాసిక్ గేమ్స్. చేతిలో పట్టుకుని ఆడినా సరే, టీవీకి కనెక్ట్ చేసి పెద్ద స్క్రీన్పై ఆడినా సరే, ఆ పాత రెట్రో ఫీల్ కచ్చితంగా వస్తుంది. రాత్రిళ్లు దుప్పట్లో దాక్కుని, లైట్ ఆఫ్ చేసి ఆడిన ఆ సీక్రెట్ మజాను కూడా ఇది మళ్లీ జ్ఞాపకం చేస్తుంది. ధర కేవలం రూ.758 మాత్రమే!

అప్పటి రోబో పెట్!
ప్రస్తుత పిల్లలు ఆడుతున్న ఆర్టిఫిషియల్ రోబో ఫ్రెండ్స్, డిజిటల్ టాయ్స్ కంటే బెటర్‌గా అప్పట్లో ఒక నిజమైన డిజిటల్ ఫ్రెండ్ ఉండేది. అది అప్పటి అందరి ఫేవరెట్ పెట్– టమాగొచ్చి! అప్పట్లో అది కేవలం ఒక గేమ్ కాదు, నిజంగా మనకున్న డిజిటల్ పెట్ ఫ్రెండ్. దానికి తిండి పెట్టాలి, స్నానం చేయించాలి, బయటికి తీసుకెళ్లాలి, ఆటలు ఆడించాలి– ఇవన్నీ మన బాధ్యతే! ఇప్పుడా పెట్ కొత్త కలర్ స్క్రీన్, టచ్ బటన్స్, కెమెరా, గేమ్స్ అన్నీ కలిపి మరింత అప్‌డేట్ అయి మన చేతిలోకి వచ్చేసింది– బాండై అమెరికా టమాగొచ్చి పిక్స్ – స్కై పర్పుల్ ఎడిషన్! ఇందులో మీరు మీ పెట్‌తో సెల్ఫీలు తీయొచ్చు, వంటలు చేయించవచ్చు, ఫ్రెండ్స్ టమాగొచ్చిలతో కలసి ప్లే డేట్స్‌కి వెళ్లొచ్చు, గిఫ్ట్‌లు మార్చుకోవచ్చు. పదిహేడుకు పైగా గేమ్స్‌లో ఆడి పాయింట్స్ సంపాదించి, మీ పెట్‌కి కావలసిన ఫర్నిచర్, ఫుడ్, యాక్సెసరీస్ కొనిపెట్టొచ్చు. ధర రూ.9,831.
