
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ (Google) మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet Inc.) తన లైఫ్ సైన్సెస్ యూనిట్ ‘వెరిలీ’ని వదిలించుకోవడానికి సిద్ధమైంది. వెరిలీని సాంకేతికంగా విడదీయడానికి ఆల్ఫాబెట్ గత రెండేళ్లుగా పనిచేస్తోందని, ఇందులో భాగంగా దాన్ని విక్రయించడమో లేదా విడిపడి వేరే సంస్థగా ఏర్పాటు చేయడమో జరుగుతుందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.
గూగుల్ చట్టవిరుద్ధంగా ప్రకటనల సాంకేతికతను గుత్తాధిపత్యం చేసిందన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రతివాది సాక్షిగా హాజరైన గూగుల్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ హీథర్ అడ్కిన్స్ వెరిలీ ప్రణాళికలను వివరించారు.
వర్జీనియాలోని ఫెడరల్ కోర్టులో అడ్కిన్స్ మాట్లాడుతూ.. ఆల్ఫాబెట్ గొడుగు కింద గూగుల్కు సోదరి సంస్థగా ఉన్న వెరిలీ గత రెండున్నర సంవత్సరాలుగా గూగుల్ సొంత మౌలిక సదుపాయాల నుండి బయటపడటానికి, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి వెళ్లడానికి కృషి చేస్తోందన్నారు.
"మేము వారిని (వెరిలీ) స్వతంత్ర సంస్థగా మార్చడానికి సహాయపడే ప్రక్రియలో ఉన్నాము" అని ఆమె యూనిట్ గురించి చెప్పారు. అది అమ్మకం లేదా స్పిన్ ఆఫ్ ద్వారా కావచ్చు అన్నారు. "ఇది (వెరిలీ) ఇకపై ఆల్ఫాబెట్ సంస్థగా ఉండకూడదన్నదే ఆలోచన" అని పేర్కొన్నారు.
వెరిలీ గురించి..
వెరిలీ అనేది గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కి చెందిన ఒక లైఫ్ సైన్సెస్ విభాగం. ఇది ఆరోగ్య పరిశోధన, ప్రెసిషన్ మెడిసిన్, డేటా ఆధారిత హెల్త్‌కేర్ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంది. వెరిలీ (మునుపటి పేరు గూగుల్ లైఫ్ సైన్స్ సర్వీస్) 2015 డిసెంబర్లో ఏర్పాటైంది. ఆల్ఫాబెట్ ఏర్పాటైన తర్వాత, గూగుల్ లైఫ్ సైన్సెస్ నుంచి వెరిలీ పేరుతో విడిపోయింది.