హెచ్–1బీ వీసాదారులకు శాశ్వత నివాసిత హోదా
‘పెర్మ్’ప్రక్రియను వేగవంతం చేస్తామని వెల్లడి
విదేశీ ఉద్యోగులకు అంతర్గతంగా సమాచారం
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసాతో గూగుల్ సంస్థలో పని చేస్తున్నవారికి శుభవార్త. వారి గ్రీన్‌కార్డు కలలకు త్వరలోనే మోక్షం లభించనుంది. తమ ఉద్యోగుల గ్రీన్‌కార్డు స్పాన్సర్‌షిప్ ప్రక్రియను వచ్చే ఏడాది వేగవంతం చేయబోతున్నట్లు గూగుల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు సంబంధిత ఉద్యోగులకు సమాచారం చేరవేసింది.
అమెరికాలో వేలాది మంది విదేశీయులు తాత్కాలిక వీసాలతో గూగుల్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కంపెనీ స్పాన్సర్‌షిప్‌తో శాశ్వత నివాసిత హోదా(గ్రీన్‌కార్డు) పొందాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. నిజానికి వారికి గత రెండేళ్లుగా గ్రీన్‌కార్డు జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అర్హులైన ఉద్యోగులకు గ్రీన్‌కార్డులు లభించడానికి వీలుగా ప్రోగ్రామ్ ఎల్రక్టానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్(పెర్మ్) దరఖాస్తులు స్వీకరించడంతోపాటు వాటికి ప్రభుత్వం నుంచి త్వరగా ఆమోదం లభించేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గూగుల్ యాజమాన్యం తెలియజేసింది. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డు పొందడంలో పెర్మ్ అనేది కీలకమైన ప్రక్రియ.
అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు ఈ ప్రక్రియను విస్తృతంగా వాడుకుంటాయి. టెంపరరీ వర్క్ వీసాలపై పని చేస్తున్న తమ ఉద్యోగులకు పరి్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ వచ్చేలా సహకరిస్తాయి. పెర్మ్‌కు అర్హులైన వారికి వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గ్రీన్‌కార్డు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై గూగుల్ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతర్గతంగా సమాచారం మాత్రం ఇచి్చంది.
విదేశీ ప్రయాణాలు ఇప్పుడే వద్దు.. ఉద్యోగులకు అమెరికా టెక్ కంపెనీల సూచన
అమెరికాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు వర్క్ వీసాలపై పని చేస్తున్న తమ ఉద్యోగులకు కీలక సూచన జారీ చేశాయి. విదేశీలకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే వాయిదా వేసుకోవాలని తెలియజేశాయి. అంతర్జాతీయ ప్రయాణాలు ఇప్పుడే వద్దని పేర్కొన్నాయి. విదేశాల్లోని అమెరికా ఎంబీసీలు, కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ చాలా ఆలస్యమవుతోంది. నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఏడాది కాలం పడుతోందని చెబుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లిరావడం కష్టమన్న ఉద్దేశంతోనే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని టెక్ కంపెనీలు సూచించాయి. ఈ మేరకు కొన్ని రోజులుగా తమ ఉద్యోగులకు సమాచారం అందిస్తున్నాయి.


