మనలో చాలా మందికి ఈమెయిల్ ఖాతాలు ఉంటాయి. అయితే ఈ మెయిల్ ఐడీల విషయంలో ఎక్కువ మందికి అసంతృప్తే ఉంటుంది. ఎందుకంటే చాన్నాళ్ల క్రితం వీటిని తెరిచేటప్పుడు సిస్టమ్ ఆటోమెటిక్‌గా సూచించిన ఏదో ఒక ఐడీని ఈమెయిల్ అడ్రెస్‌గా సెట్ చేసుకుని ఉంటారు. కానీ దాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పుడు అరే ఈ మెయిల్ ఐడీ అంత బాగా లేదే.. దీన్ని మనకు నచ్చినట్టు మార్చుకునే అవకాశం ఉంటే బాగుండు.. అనుకుంటుంటారు.
ఇప్పుడా అవకాశాన్ని గూగల్ కల్పించబోతోంది. టెక్ దిగ్గజం రాబోయే సిస్టమ్ మార్పును వివరించే హిందీ భాష సపోర్ట్ డాక్యుమెంటేషన్‌ను ఇటీవల అప్డేట్ చేసింది. అందులో జీమెయిల్ అడ్రస్లను మార్చుకునే వెసులుబాటు గురించి పేర్కొంది.
ప్రసిద్ద ఫోర్బ్స్ ప్రచురించిన కథనం ప్రకారం.. గూగుల్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్తో యూజర్లు తమ జీమెయిల్ అడ్రెస్లను మార్చుకోవచ్చు. అయితే ఇందుకు నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. ఇలా మెయిల్ ఐడీ మార్చుకోవడానికి ఏడాదికి ఒక్కసారి.. మొత్తంగా మూడు సార్లు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇంతకుముందున్న మెయిల్ అడ్రస్ కూడా అలియాస్గా కొనసాగుతుంది. అంటే దానికి వచ్చే మెయిల్స్ అలాగే వస్తుంటాయి. ఇక ఖాతా డేటా అంటే ఫోటోలు, మెసేజ్లు, ఇమెయిల్లు వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు.
కాగా ఇప్పటి వరకు గూగుల్ అకౌంట్కు థర్డ్ పార్టీ ఈమెయిల్ చిరునామాలతో సైన్ అప్ చేసిన వినియోగదారులకు మాత్రమే ఖాతా ఈమెయిల్ మార్పులను అనుమతిస్తోంది. కానీ జీమెయిల్ అడ్రెస్ల మార్పునకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు గూగుల్ అందిస్తున్న కొత్త ఫీచర్ను సోషల్ మీడియా యూజర్లు స్వాగతిస్తున్నారు.


