
బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) దర్శకుడిగా తెరకెక్కిస్తున్న 'ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్' ఫస్ట్ లుక్ విడుదలైంది. అయితే, సినిమా కాకుండా వెబ్‌సిరీస్ కోసం తొలిసారి మెగా ఫోన్ పట్టాడు. ఈ చిత్రాన్ని ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix), ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ (Red Chillies Entertainment) సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఆగష్టు 20న ప్రివ్యూ ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే, ఈ మూవీకి కథ కూడా ఆర్యన్ రాయడం విశేషం. బాలీవుడ్‌లో ఇప్పటివరకూ చూడని సరికొత్త వెబ్‌సిరీస్‌ను అందించబోతున్నామని గతంలోనే ఆర్యన్ యూనిట్ ప్రకటించింది.

ఈ వీడియోలో ఆర్యన్ వాయిస్ ఓవర్‌తో కథనం ప్రారంభమౌతుంది. కానీ, అతని తండ్రి షారుఖ్ ఖాన్ శైలిలో వీడియో ఉంది. తేడా ఏమిటంటే ఖాన్ ప్యార్ (ప్రేమ) గురించి మాట్లాడగా, కుమారుడు వార్ (దాడి) గురించి మాట్లాడుతాడు. ఇందులో బాబీ డియోల్, లక్ష్య (Kill ఫేమ్), మనోజ్ పహ్వా, మోనా సింగ్, మనీష్ చౌదరి, రాఘవ్ జుయల్, అన్య సింగ్ వంటి స్టార్స్ నటించనున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అలియాభట్ వంటి స్టార్స్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.