మనోజ్, సాయిమాధవ్, అవినాశ్, శంతను
‘‘ఈ రోజుల్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది లేదు. కంటెంట్ బాగుండే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బాగున్న ప్రతి సినిమా భాషలకు అతీతంగా ఇండియన్ సినిమా అయ్యింది. సాయం చేసే ప్రతి ఒక్కరి హృదయంలో హనుమ(ఆంజనేయస్వామి) ఉంటారు. అవినాశ్, అతని టీమ్ కష్టపడి చేసిన ‘వానర’ సినిమా సక్సెస్ కావాలి’’ అని మంచు మనోజ్ అన్నారు. అవినాశ్ తిరువీధుల హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘వానర’. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటించగా, నందు విలన్ గా పాత్రపోషించారు.
శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్‌పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధం అవుతోంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మనోజ్ మాట్లాడుతూ–‘‘అవినాశ్ ఫాదర్ హనుమంతరావుగారు హీరో కావాలనుకున్నారు. కానీ,పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లారు. ఆయన తన కలను కొడుకు అవినాశ్ ద్వారా నిజం చేసుకున్నారు’’ అని చెప్పారు.
‘‘వానరుడిలాంటి హీరో బైక్‌ని రావణుడిలాంటి విలన్ తీసుకెళ్లిపోతే, ఆ బైక్‌ను తిరిగి తెచ్చుకునేందుకు ఎలాంటిపోరాటం చేశాడు? అన్నదే ఈ చిత్ర కథ’’ అని అవినాశ్ తిరువీధుల తెలిపారు. ‘‘ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు శంతను పత్తి. డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా, నటులు శివాజీ రాజా, హర్ష, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, స్టోరీ– స్క్రీన్ ప్లే రైటర్ విశ్వజిత్, కెమెరామెన్ సుజాత సిద్ధార్థ్, క్రియేటివ్ డైరెక్టర్ జానకీరామ్ మాట్లాడారు.


