
నారాయణపేట జిల్లా పల్లెగడ్డను ఖాళీ చేయాలని దేవాదాయ శాఖ ఆదేశం
చిన్నరాజమూరు ఆంజనేయస్వామి ఆలయ మాన్యం భూమిలో ఊరు
7 ఏళ్లుగా గ్రామస్తుల న్యాయపోరాటం.. పట్టించుకోని ప్రజా ప్రతినిధులు
250 కుటుంబాల్లో ఆందోళన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆ పల్లెలో మూడు తరాల ప్రజలు ఉన్నంతలో సుఖంగా జీవించారు. ప్రస్తుతం నాలుగో తరం జీవనం సాగిస్తోంది. 200 ఏళ్లకు పైగా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆ పల్లె వాసులకు దేవాదాయ శాఖ రూపంలో ఆపద ముంచుకొచ్చింది. ఆలయ మాన్యం భూమిలో ఊరు ఉందంటూ.. గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు హుకుం జారీచేశారు. దీంతో గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. నారాయణపేట జిల్లాలోని పల్లెగడ్డ వాసుల దీనగాథపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్..
250కి పైగా కుటుంబాలు.. 16,124 జనాభా
పర్వత ప్రాంతమైన పల్లెగడ్డ మొదట నారాయణపేట జిల్లా మరికల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. 2018లో ఇది నూతన జీపీగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఈ పల్లెలో 250 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నాయి. మొత్తం 16,124 మంది జనాభా.. 745 మంది ఓటర్లు ఉన్నారు. 20 ఎకరాలు గ్రామకంఠం భూమిగా రికార్డులో నమోదై ఉంది.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చిన్న రాజమూరు ఆంజనేయ స్వామి ఆలయం పేరిట సర్వే నంబర్ 269, 270, 271లో 69 ఎకరాల మాన్యం భూమి ఉంది. దీనికి పైభాగాన మరికల్‌లో నివసిస్తున్న కాట్టెకొండ వంశీయుల భూములు ఉన్నాయి.
సుమారు 200 ఏళ్ల క్రితం ఆ వంశస్తులైన హన్మన్న, ముసిలన్న, చిన్న రాజన్న, తిమ్మన్న సదరు ఆలయ భూమిలో గుడిసెలు వేసుకుని కుటుంబాలతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో వారి వారసులు సైతం అక్కడే వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడ్డారు. క్రమక్రమంగా జనాభా పెరుగుతూ వచ్చింది. పక్కా ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగాయి. దీంతో అప్పటి పెద్దలు గ్రామానికి పల్లెగడ్డగా నామకరణం చేశారు.
2018లో 11 మందికి... ఇటీవల 25 మందికి..
ఆలయ మాన్యం భూమిలో నిర్మించుకున్న ఇళ్లు తొలగించాలని 2018లో దేవాదాయ శాఖ అధికారులు పల్లెగడ్డ వాసులు 11 మందికి నోటీసులు జారీ చేశారు. దీంతో వారు నారాయణపేట జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జూన్, జూలైలో మరో 25 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 18న దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ కోర్టుకు హాజరుకావాలని అందులో పేర్కొనడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది
ఏడేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నా..
అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయా లంటున్నారనే విషయాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఏడేళ్లుగా నారాయణపేట కోర్టు చుట్టూ తిరుగుతున్నా. గ్రామం ఖాళీ చేసి పోతే మా బతు కులేం కావాలి? మాకు అన్యాయం జరగకుండా చూడా ల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. – హన్మంతు, పల్లెగడ్డ
ముత్తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాం..
నేనొక్కడినే కాదు.. చాలా మంది అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నారు. మా ముత్తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఖాళీ చేయాలంటూ నాతో పాటు 25 మందికి నోటీసులిచ్చారు. మాకు ప్రభుత్వం ఎక్కడైనా ఇళ్లు నిర్మించి ఇస్తే.. ఊరు ఖాళీ చేయడానికి అభ్యంతరం లేదు. – గోవింద్, పల్లెగడ్డ
ఆధారాలుంటే కోర్టుకు సమర్పించాలి..
చిన్నరాజమూరు ఆంజనేయ స్వామి ఆలయ భూమిలో ఇళ్లు నిర్మించడం వల్లే పల్లెగడ్డ గ్రామస్తులకు దశల వారీగా నోటీసులిస్తున్నాం. వారి వద్ద ఏమైనా ఆధారాలుంటే కోర్టులో సమర్పించాలి. లేకుంటే కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – కవిత, దేవాదాయ శాఖ ఈఓ, మహబూబ్‌నగర్