సాక్షి,హైదరాబాద్: నమస్తే ఫ్రెండ్స్. నాపేరు అన్వేష్. నేను ప్రపంచ యాత్రికుడిని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళ్లతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని’ అంటూ ప్రపంచ దేశాల్లో వింతలు, విశేషాల గురించి వివరించే యూట్యూబర్ అన్వేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే వరుస వివాదాలు, క్షమాపణలు, సబ్‌స్కైబర్ల సంఖ్య భారీ పడిపోయింది.
ఈ క్రమంలో గరికపాటిపై యుద్ధం అంటూ మరో వివాదంలో చిక్కుకున్న అన్వేష్‌పై తెలంగాణ మహిళా కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదుల్లో మహిళలపై అవమానకరంగా, అసభ్యంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళలను వస్తువుల్లా చూపిస్తూ కంటెంట్‌ను ప్రసారం చేశాడని బాధితులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం.
మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వీడియోలు రూపొందించడమే కాకుండా, బాలల హక్కులకు భంగం కలిగించే కంటెంట్ కూడా ఆ ఛానల్‌లో ఉందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఆ ఫిర్యాదులపై.. సమాజంలో నైతిక విలువలు, సామాజిక సమతుల్యతకు భంగం కలిగించేలా ఈ వీడియోలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది.
సంబంధిత వీడియోల లింకులు, ఖాతా వివరాలను సేకరించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కూడా కమిషన్ గుర్తించింది. ఈ అంశాలు ప్రజా నైతికతకు విరుద్ధమని, చట్టపరమైన చర్యలు అవసరమని స్పష్టం చేసింది. విచారణలో సంబంధిత ఇన్‌ఫ్లుయెన్సర్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించింది. అందుకే ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ (NCW)కు పంపినట్లు తెలంగాణ మహిళా కమిషన్ వెల్లడించింది.
మహిళల గౌరవాన్ని కాపాడటంలో, బాలల హక్కులను రక్షించడంలో ఇలాంటి చర్యలు అత్యవసరమని కమిషన్ పేర్కొంది. ఎన్‌సీడబ్ల్యూ ఈ కేసుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మహిళా కమిషన్ విజ్ఞప్తి చేసింది.


