
హరియాణలో పట్టుబడిన నిందితుడు
హిందూపురం/చిలమత్తూరు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంట ఎస్‌బీఐ బ్రాంచ్‌లో గత నెల 27వ తేదీన జరిగిన భారీ దోపిడీ కేసులో అనిల్‌కుమార్ పన్వార్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు హరియాణలో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హిందూçపురం డీఎస్పీ కేవీ మహేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విచారణ అనంతరం పన్వార్‌ను కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. పన్వార్‌పై 16 కేసులు ఉన్నట్లు సమాచారం.
బ్యాంకు వెనుక భాగంలోని కిటికీ గ్రిల్‌ను గ్యాస్ కట్టర్‌తో తొలగించి లోపలికి చొరబడిన దొంగలు ఐరన్ లాకర్ డోర్‌ను గ్యాస్‌కట్టర్‌తో కత్తిరించి.. అందులోని సుమారు రూ.12 కోట్ల విలువైన 11,400 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.37.92 లక్షల నగదు అపహరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ కోసం నియమించిన ప్రత్యేక పోలీసు బృందాలు పలు రాష్ట్రాల్లో పర్యటించి, పాత నేరస్తులను విచారించి, అత్యాధునిక సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించాయి. చోరీకి గురైన సొత్తు ఆచూకీ ఇంకా తెలియరాలేదని, కోర్టు అనుమతితో పన్వార్‌ను కస్టడీకి తీసుకుని విచారణ కొనసాగిస్తామని డీఎస్పీ తెలిపారు.