
చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. బయటకు మాత్రం అందంగానే కనిపిస్తుంది. కానీ లోపలకు తొంగి చూస్తే.. అక్కడ కూడా కష్టాలు, బాధలు ఉంటాయి. తెర ముందు ముఖానికి రంగు వేసుకొని జనాలకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న చాలా మంది నటీనటులు తెర వెనుక చాలా కష్టాలను అనుభవించినవాళ్లే. తినడానికి తిండిలేని పరిస్థితులను ఎదుర్కొని ఉన్నవాళ్లు చాలా మందే ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి వారిలో కన్నడ నటి, యాంకర్ సౌమ్యరావు(Sowmya Rao) కూడా ఒకరు. ‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ కన్నడ బ్యూటీ.. రియల్ లైఫ్‌లో చాలా కష్టాలను అనుభవించింది. తినేందుకు తిండిలేక పస్తులు ఉన్న రోజులు కూడా చాలానే ఉన్నాయట. తాజాగా ఓ టీవీ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను పడిన కష్టాలను చెబుతూ సౌమ్య ఎమోషనల్ అయింది.
అప్పుల బాధలు తట్టుకోలేక..
నా చిన్నప్పుడు నాన్న బాగా అప్పులు చేశాడు. ఆ డబ్బుతో ఏం చేశాడో తెలియదు కానీ అప్పు ఇచ్చిన వాళ్లంతా మా ఇంటికి వచ్చి గొడవ చేసేవాళ్లు. నాన్న చేసిన అప్పులకు అమ్మ మాటలు పడాల్సి వచ్చేంది. కొంతమంది అయితే వల్గర్‌గా మాట్లాడేవాళ్లు. ‘నీకు కూతురు ఉందా? పెద్దమనిషి అయిందా?’ అంటూ అసభ్యకరంగా మాట్లాడేవాళ్లు. వారి బాధలు తప్పుకోలేక ఓ రోజు రాత్రి మా అమ్మ నన్ను, బ్రదర్‌ని తీసుకొని తిరుపతి వచ్చింది.
అప్పుడు అమ్మ చేతిలో కేవలం రూ. 100 మాత్రమే ఉన్నాయి. రాత్రంతా బస్టాండ్‌లో నిద్రపోయాం. ఉదయం గుడిలో పెట్టే అన్న కోసం చాలా ఎదురు చూశాం. దేవుడి దర్శనం కంటే అక్కడ పెట్టే అన్నంపైనే మా దృష్టి ఉండేది. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే.. చుట్టు పక్కల వాళ్లు తలుపులు వేసుకునేవాళ్లు. ఎందుకంటే చుట్టాలకు టీ లేదా అన్నం పెట్టాలన్నా.. పక్కింటివాళ్లనే అడిగేవాళ్లం. అందుకే బంధువులు వస్తే.. అంతా తలుపులు మూసుకునే వాళ్లు.
టైపింగ్ నేర్పిస్తానంటూ మిస్ బిహేవ్ చేశాడు
నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచే పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని. అలా ఓ సారి ఓ లాయర్ దగ్గర పని చేశాను. ఆయన ఇంట్లోనే వర్క్ ఉండేది. పని కోసం వెళ్తే..ఆయన నాతో మిస్ బిహేవ్ చేసేవాడు. టైపింగ్ నేర్పిస్తా అంటూ నాపై చేతులు వేసేవాడు. ఆయన భార్య, తల్లి బయటకు వెళ్లగానే నాతో మిస్ బిహేవ్ చేసేవాడు. నా పరిస్థితి ఆయనకు తెలుసు. దాన్న ఆయన అలుసుగా తీసుకున్నాడు. అందుకే మన కష్టాలను, బాధలను ఇతరులతో షేర్ చేసుకోవద్దు. మనకు కష్టం ఉంది, పరిస్థితి బాలేదు అని తెలిస్తే మనతో ఆడుకుంటారు.
స్టార్ హీరో ఇంటర్వ్యూకి వెళ్తుండగా ప్రమాదం
న్యూస్ రీడర్‌గా కన్నడలో నా కెరీర్ ప్రారంభం అయింది. కెరీర్ ప్రారంభంలో చాలా కష్టపడ్డాను. ఒకేసారి మూడు చానళ్లలో పని చేశాను. ఒక రోజు ఒక పెద్ద హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నా కాలికి తీవ్రంగా గాయం అయింది. అందరూ ఆస్పత్రికి వెళ్దాం.. అంటే నేను షూట్‌కి వెళ్లాను. స్టూడియోలో నన్ను చూసి అందరూ భయపడ్డారు. కాలికి తీవ్రంగా గాయం అయిందని.. ముందు ఆస్పత్రికి వెళ్లమని చెప్పాను.
కానీ నాకేమో నొప్పి కంటే ఎక్కువగా ఇంటర్వ్యూ మిస్ అయితే డబ్బులు రావు కదా అనే బాధే ఎక్కువగా ఉంది. నేను జీరో నుంచి వచ్చాను .అందుకే సెలెబ్రిటీ అనే ఫీలింగ్ నాకు ఉండదు. ఇప్పటికే ఏదైనా ఈవెంట్ ఉంటే ఆటోలో కూడా వెళ్తుంటాను’ అని సౌమ్యరావు చెప్పుకొచ్చింది.