
సాక్షి, అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలు రచ్చ రేపుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను బూతుల తిట్టిన ఎమ్మెల్యే దగ్గుపాటి ఆడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయం ముందు బైఠాయించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే ప్రసాద్, జూ.ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఫోన్ ఆడియో లీక్ రాష్ట్రవాప్తంగా కలకలం సృష్టిస్తోంది. వార్ -2 సినిమా ఆడదంటూ పదేపదే చెప్పిన దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్‌ను అత్యంత దారుణంగా దూషించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ హెచ్చరించడంతో పాటు బూతులతో రెచ్చిపోయారు. ఎమ్మెల్యే అయి ఉండి.. ఇంత అసభ్యకరమైన భాషను వాడటంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ జోలికి వస్తే సహించేది లేదని జూ.ఎన్టీఆర్ అభిమానులు తేల్చి చెప్పారు. నాలుగు గోడల మధ్య క్షమాపణ చెబితే కుదరదని.. ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేన్నారు. మేం ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచావ్ అంటూ జూ.ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు.

టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇవాళ ఉదయం నుంచి తీవ్ర దుమారం రేగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు, నారా లోకేష్‌లకు నచ్చదు.. అందుకే ఆయన సినిమాలు ఆడనివ్వను.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మీరూ చూడవద్దంటూ దగ్గుపాటి ప్రసాద్ హుకూం జారీ చేశారు. అసభ్య పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్‌ను దూషించిన ఆడియో వైరల్ కావటంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్య పదజాలంతో దూషించారు ఎమ్మెల్యే దగ్గుపాటి.. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్ షోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. ఒక్కసారి గా రెచ్చిపోయిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ పై రాయలేని భాషలో నోరు పారేసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను వ్యతిరేకిస్తారని.. మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడవద్దంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వనని.. బాక్సులు, స్క్రీన్లు కాల్చేయిస్తానంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి వార్నింగ్ ఇచ్చారు.

ఈ ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో భయపడ్డ.. దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెబుతూ ఓ విడియో విడుదల చేశారు. అది ఫేక్ వీడియో అన్న ఎమ్మెల్యే.. తనకు నారా-నందమూరి కుటుంబాలపై గౌరవం ఉందంటూ చెప్పుకొచ్చారు.
మరో వైపు, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని... అలా చెప్పకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫ్లెక్సీలు చించి వేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అందుబాటులో లేరని... ఆయన వచ్చాక బహిరంగ క్షమాపణలు చెప్పిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం హామీ ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన విరమించారు


