
వీధికుక్కల పట్ల అమానవీయంగా ఉండే వారి కంటే మానవత్వంతో వ్యవహరించే వారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో దిల్లీకి చెందిన దేవీజీ ఒకరు. డెబ్బై నుంచి ఎనభైవరకు వీధికుక్కల ఆలనాపాలనా చూసుకుంటుంది దేవీజీ. భర్త చనిపోయిన, పిల్లలు దూరమైన దేవికి శునకాలే పిల్లలు. స్ఫూర్తిదాయకమైన దేవీజీ గురించి కంటెంట్ క్రియేటర్ నీతూ బిషత్ రావత్ ఒక వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
తనకు ఉన్న చిన్నస్థలంలోనే వీధి కుక్కలకు ఆశ్రయం ఇస్తున్న దేవీజీ రోజూ వాటికి ఆహారం అందించడానికి నానా కష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో దేవీజీకి తోచిన సహాయం చేయాలని నెటిజనులను కోరింది నీతు. ఆమె వీడియో షేర్ చేయడానికి ముందు దేవీజీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. దేవీజీ గురించి తెలుసుకున్న ఎంతోమంది ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఇన్ని కుక్కలను పెంచుకొని ఏం చేస్తావు?’ అని ఎంతోమంది దేవీజీని వెటకారంగా అడిగేవారు.
దీనికి ఆమె చిరునవ్వు మాత్రమే సమాధానం అయ్యేది. అయితే అసలుసిసలు సమాధానం తరచుగా కనిపించే ఒక దృశ్యంలో దొరుకుతుంది. ఆ దృశ్యం: తల్లి చుట్టూ పిల్లలు చేరినట్లు దేవీజీ చుట్టూ శునకాలు చేరుతాయి. తన పిల్లలతో మాట్లాడినట్లుగానే శునకాలతో ప్రేమగా మాట్లాడుతూ కనిపిస్తుంది దేవిజీ.
(చదవండి: ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’)